లండన్ : ‘‘నేను భగవద్గీత చదివాను. ఉపనిషత్తులూ చదివాను. అలాగే చాలా హిందూ పుస్తకాలు కూడా చదివాను. బీజేపీ చేసే ఏ పనిలోనూ హిందూ లేదు’’ అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పారి్‌సలోని సైన్సెస్ పీవో యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన చర్చాకార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు విద్యార్థులు భారత్‌లో పెరుగుతున్న హిందూ జాతీయవాదం గురించి ప్రశ్నించగా.. ‘‘నీకంటే బలహీనులైనవారిని భయపెట్టొచ్చని, వారికి హాని చేయొచ్చని నేను ఏ హిందూ పుస్తకంలోనూ చదవలేదు. ఏ ప్రముఖ హిందువు నుంచీ వినలేదు. కాబట్టి ఈ ‘హిందూ జాతీయవాదులు’ అనే పదం తప్పు పదం. వారు హిందూ జాతీయవాదులు కారు. వారికి హిందూయిజంతో ఎలాంటి సంబంధమూ లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేజిక్కించుకోవాలన్నదే వారి లక్ష్యం’’ అని బదులిచ్చారు. భారతీయ ఆత్మను కాపాడే పోరాటానికి విపక్ష కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కల్లోల స్థితిలో ఉన్న భారతదేశ పరిస్థితి బాగుపడుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా పేరును మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించగా.. రాజ్యాంగంలో భారత్, ఇండియా అనే రెండు పేర్లూ ఉన్నాయని రాహుల్ గుర్తుచేశారు. దేశాన్ని ఈ రెండింటిలో ఏ పేరుతోనైనా పిలవొచ్చని.. కానీ, మార్పు వెనుక ఉన్న ఉద్దేశమే అసలు విషయమని వ్యాఖ్యానించారు. విపక్షాలు తమ కూటమికి ఇండియా (ఇండియన్ నేషనల్ డెవల్‌పమెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్) అనే పేరు పెట్టుకోవడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిందని.. అందుకే ఇలా వింతగా ప్రవర్తిస్తోందని, దేశం పేరు మార్చాలనుకుంటోందని విమర్శించారు. పేరు మార్చాలనుకునే వ్యక్తులు ప్రాథమికంగా చరిత్రను తిరస్కరిస్తున్నట్టేనని.. మనకు నచ్చినా, నచ్చకున్నా మనకంటూ ఒక చరిత్ర ఉందన్న మాట వాస్తవమని వ్యాఖ్యానించారు. ‘‘వారు సమాజాన్ని విభజిస్తారు. విద్వేషాన్ని వ్యాపింపజేస్తారు. అది వారి విధానం. తమకు ఆర్థికసాయం అందించి, మద్దతునిచ్చే.. దేశంలోని అత్యంత శక్తిమంతులైన, సంపన్నులైన క్రోనీ క్యాపిటలిస్టులతో వారికి సత్సంబంధాలున్నాయి’’ అని బీజేపీని, అదానీ వంటి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి రాహుల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.