న్యూఢిల్లీ: పార్లమెంటులో గందరగోళం మధ్య వరుసగా ముసాయిదాల్ని ఆమోదించుకుంటూ పోతున్నారు. పార్లమెంటును నడిపే పద్ధతి ఇది కాదని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ‘ ప్రధాని సభకు రారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన ఏ అంశాన్ని ప్రస్తావించేందుకు విపక్షాలను అనుమతించరు. ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనీ చేస్తుండటం దురదృష్టకరమ’ న్నారు. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో రాహుల్ గాంధీ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ‘12 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాసామ్యం గొంతు నులిమారు. ఎంపీలు చేసిన తప్పేమీ లేదు. పార్లమెంటులో కీలకాంశాలపై చర్చిచేందుకు విపక్షాలను అనుమతించడం లేదు. ఒక మంత్రి రైతులను చంపాడు. ప్రధానికి ఆ విషయం తెలుసు. ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదార్లు రైతులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీలను రాజ్యసభ చైర్మనో, ప్రధానో సస్పెండ్ చేయ లేదు. అధికారంతో రైతుల ఆదాయాన్ని దొంగిలించాలని వారు కోరుకుంటున్నారు. ప్రధాని, చైర్మన్ కేవలం వాటిని అమలు చేస్తున్నార’ని విమర్శలు గుప్పించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు నుంచి సస్పెన్షన్కు గురైన రాజ్యసభ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనికి విపక్షాలు మద్దతుగా నిలవడంతో ఉభయ సభలూ సజావుగా సాగడం లేదు. రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేయాలని మంగళవారం విపక్షాల సభ్యులు పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. విపక్షాల సభా నాయకులూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.