విశాఖ : ‘అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అర్థమవుతుందా? అని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎద్దేవాచేసారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి పవన్ కల్యాణే హానికరం అని ప్రజలు అంటున్నా రన్నారు. స్టీల్ ప్లాంటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సర్కారుతో పోరాటం చేయాలని అజ్ఞాన వాసి పవన్ కల్యాణ్ ఆశించటం హాస్యాస్పద మన్నారు. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర సర్కారుకి చెందినదని, ఏపీ ప్రభుత్వానికి చెందినది కాదని ఇప్పటికైనా తెలుసుకోవాలని చురకంటించారు. ఆ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకూడదని ఇప్పటికే సీఎం జగన్, ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారని, అసెం బ్లీలోనూ తీర్మానం చేశారన్నారు. పవన్ కల్యాణ్ తనకు ఇదంతా తెలియదన్నట్లు సినిమా నాటకాలు ఆడుతూ ఆందోళనలకు దిగుతున్నారని విమర్శించారు. సుజనా చౌదరిని గతంలో కేంద్ర మంత్రిని చేయడంలో చంద్రబాబు నాయుడు చూపిన శ్రద్ధ విశాఖ ఉక్కు పరిశ్రమపై చూపి ఉంటే బాగుండేదన్నారు. తన మిత్రుడు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడరని గేలి చేసారు. బాబు కాలికి ముల్లు గుచ్చుకొంటే పవన్ కల్యాణ్ కంటిలో కన్నీరు వస్తుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం పవన్ కల్యాణ్ బీజేపీ మీద పోరాటం చేయకుండా వైసీపీ మీద ఉద్యమం చేస్తామనటం సిగ్గు చేటన్నారు.