
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారాన్ని చేపడితే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఇక్కడ పునరుద్ఘాటించారు. అధ్యక్షుడి హోదాలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించిన తర్వాత ప్రసంగించారు. ‘గత ఏడాదిగా దీనిపై కసరత్తు చేస్తున్నాం. దీనిలో అన్ని వాస్తవాలే ఉండాలని నిర్ణయించాం . అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా కొత్త మార్గదర్శకంలో ప్రణాళికను రచించాం. దీన్ని గదిలో కూర్చుని రూపొందించలేదు. ప్రజల మనసులో ఆలోచన ప్రతి బింబించేలా రూపకల్పన చేశామ’ని చెప్పారు. పొందు పరచిన ఐదు ప్రధాన అంశాల్లో ముఖ్యమైనది ‘’న్యాయ్’’. దేశంలోని 20 శాతం పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందిస్తాం. రెండో ముఖ్యాంశం ఉద్యోగ కల్పన. మొత్తం 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యువకులు వ్యాపారం చేయాలనుకుంటే మూడేళ్లపాటు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఉపాధి హామీ పథ కాన్ని నూరు నుంచి 150 రోజులకు పొడిగిస్తాం’అని రేఖా మాత్రంగా పేర్కొన్నారు.‘ధనవంతులు రుణాలు తీసుకొని బుద్ధి పూర్వకంగా ఎగవేస్తు న్నారు.వారిపై పాలకులు ఎటువంటి చర్యల్ని తీసుకోవటం లేదు. రైతులు నష్టాల్లో కూరుకు పోయి రుణ బకాయిల్ని తీర్చక పోతే క్రిమినల్ కేసులు పెడుతున్నారు. రైతులు బకాయల్ని చెల్లించక పోతే క్రిమినల్ కేసులు దాఖలు చేయనివ్వమని’ రాహుల్ భరోసా ఇచ్చారు. విద్యారంగానికి బడ్జెట్లో 6 శాతం నిధులు కేటాయిస్తామంటూ ప్రభుత్వ వైద్యాన్ని మరింత మెరుగు పరుస్తామనిభరోసా ఇచ్చారు. దేశంలో 2030 నాటికి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్దీప్ సుర్జేవాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమైన ఐదంశాలు
- న్యాయ్ పథకం ద్వారా ఏడాదికి రూ.72వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తుంది.
- ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి మూడేళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న పని దినాలను 100 నుంచి 150కి పెంచుతాం.
- రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించం.
- విద్యకు జాతీయ స్థూలోత్పత్తిలో ఆరు శాతం ఖర్చు.
- జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట.
మరిన్ని అంశాలు..
- అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా
- అధికారంలోకి రాగానే రాఫేల్ ఒప్పందం మీద విచారణ
- బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై సమగ్ర విచారణ