విజయనగరం: ‘యుటర్న్’ చంద్రబాబు ప్రజాదరణ కోల్పోయినట్లు తమ సర్వేలో తేలిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. విజయ నగరం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. 2014లో అశోక్ గజపతి రాజు కూడా నరేంద్ర మోదీ వల్లే గెలిచారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు ఇప్పటి వరకూ లెక్కలు ఇవ్వలేదని విమర్శించారు. పోలవరానికి జాతీయ హోదా కల్పించి, నిధుల మంజూరు చేస్తే చంద్ర బాబు రెండు చేతులా ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సీబీఐని రాష్ట్రంలోకి అడుగు పెట్టకూడదని చెప్పిన ఏకైక ముఖ్య మంత్రి చంద్ర బాబే నని వ్యాఖ్యానించారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి రూ. 2వేల కోట్ల నిధులు ఇస్తే చంద్ర బాబు గ్రాఫిక్స్ చూపిస్తూ తాత్కాలిక భవనాల్లో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్లు వేసుకున్నారని ఆరోపించారు.