మహిళల టీ20లో భారత్ శుభారంభం

  • In Sports
  • February 21, 2020
  • 138 Views
మహిళల టీ20లో భారత్ శుభారంభం

సిడ్నీ: పూనమ్‌ యాదవ్‌ (4/19) విజృంభించడంతో మహిళా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీప్తి శర్మ (49*, 46 బంతుల్లో; 3×4) రాణించింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ 19.5 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బ్యాట్స్‌వుమెన్‌లో అలిసా హీలీ (51, 35 బంతుల్లో; 6×4, 1×6), ఆష్లీ గాడ్నర్ (34, 36 బంతుల్లో; 3×4, 1×6) పోరాడారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. బెత్‌ మూనీ(6)తో కలిసి వికెట్‌ కీపర్‌ అలిసా హీలి తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించింది. అనంతరం మూనీని శిఖ పెవిలియన్‌కు చేర్చినా అలీసా తన దూకుడు కొనసాగించింది. ఫోర్లు, సిక్సర్లతో అర్ధ శతకాన్ని నమోదు చేసుకుంది. అలిసా జోరుని చూస్తుంటే ఆసీస్‌దే మ్యాచ్‌ అనిపించింది. కానీ, పూనమ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పింది. బంతిని గింగరాలు తిప్పుతూ ఆసీస్‌ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు చేర్చింది. అయితే పూనమ్‌ హ్యాట్రిక్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. 12 ఓవర్‌ మూడో బంతికి రేచల్‌ హేన్స్‌ (6)ను, నాలుగో బంతికి ఎలిస్‌ పెర్రీని ఔట్‌ చేసింది. అయితే తర్వాతి బంతి జొనస్సెన్‌ (2) బ్యాట్‌కు ఔట్‌ సైడ్‌ఎడ్జ్‌ తీసుకుంది. కాస్త కష్టతరమైన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ తానియా అందుకోలేకపోయింది. అయితే మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు చేరుతున్నా ఆష్లీ గాడ్నర్ పోరాడింది. ఫోర్లు, సిక్సర్లతో లక్ష్యాన్ని కరిగించింది. అయితే ఆఖరి ఓవర్‌లో శిఖకు రిట్నర్‌క్యాచ్‌ ఇచ్చి ఔటవ్వడంతో ఆసీస్‌ ఓటమి లాంఛనమైంది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ నాలుగు, శిఖ మూడు, రాజేశ్వరి ఒక వికెట్‌ పడగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో చక్కగా ఆడింది. స్మృతి మంధాన (10, 11 బంతుల్లో; 2×4)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన షెఫాలి వర్మ (29, 15 బంతుల్లో; 5×4, 1×6) మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేసింది. ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. దీంతో నాలుగు ఓవర్లకు 40/0. ఈ జోరుని చూస్తే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది. కానీ, ఆసీస్‌ స్పిన్నర్‌ జొనస్సెన్‌ (2/24) ధాటికి పరిస్థితి మారిపోయింది. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి శర్మతో కలిసి జెమిమా రోడ్రిగ్స్‌ (26, 33 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అయితే ఆఖర్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడలేకపోవడంతో భారత్‌ 132 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్‌ (2, 5 బంతుల్లో), వేదా (9*, 11 బంతుల్లో) పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో జోనస్సెన్ రెండు, ఎలిసీ పెర్రీ, డెలిస్సా చెరో వికెట్‌ పడగొట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos