రా…రమ్మంటున్న జలపాతాలు

  • In Tourism
  • November 25, 2019
  • 30 Views

(రమేష్‌ రెడ్డి)

ప్రకృతి ప్రేమికులకు విశాఖ ఏజెన్సీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. పచ్చదనాన్ని పరుచుకున్న మైదానాలు, వీనుల విందుగా శబ్దాలు చేసే జలపాతాలు…ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటైన విశాఖ జిల్లా పాడేరు సమీపంలోని జి.మాడుగుల మండలం కొత్తపల్లికి ఆనుకుని జలపాతాన్ని చూసి తరించాల్సిందే. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారి పక్కనే ఈ జలపాతం ఉండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. పాల నురగలా కనపడే ఈ జలపాతం… ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నది.

ప్రకృతి అందాలకు నెలవు విశాఖ మన్యం. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూస్తుంటే అక్కడే స్థిరపడాలని కోరిక తప్పక పుడుతుంది. సీలేరు నది ఇవతల, అవతల, పరిసర ప్రాంతాల్లో పర్యటన మరవలేని అనుభూతిని మిగుల్చుతుంది. ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో జలపాతాలు ఆకాశం నుంచి దూకుతున్నాయా…అన్నట్లుగా పర్యాటకుల్లో ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. అలసి సొలసిన మనసుకు హాయి కలిగిస్తున్నాయి. పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే దేశంలో నెంబర్ వన్ టూరిస్ట్‌ స్పాట్ గా విశాఖ కీర్తినార్జిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా సమాచారం