వార్నర్‌కే అనుమానం…!

  • In Sports
  • November 12, 2021
  • 99 Views
వార్నర్‌కే అనుమానం…!

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో గురువారం జరిగిన మ్యాచులో ఆసీస్‌ ఆటగాళ్లు మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ అద్భుతమే చేశారు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో సెమీ ఫైనల్‌లో వరుసగా 40, 41 పరుగులతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో వేడ్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచుకు హైలెట్‌గా నిలిచింది. ఒకవేళ వేడ్ గనుక మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ మ్యాచులో అర్ధ సెంచరీ సాధించే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్.
30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే, వార్నర్ అవుట్ అయిన విధానం.. అందునా అతడు రివ్యూకు వెళ్లకపోవడం అభిమానులను నిరాశపరిచింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ అవుటైన తర్వాత 49 పరుగులతో క్రీజులో ఉన్న వార్నర్.. షాబాద్ ఖాన్ వేసిన 11వ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేయగా.. కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ అప్పీల్‌ చేయగా అంపైర్ అవుట్‌గా తేల్చాడు. కానీ.. అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బ్యాట్‌కు బంతి ఎక్కడా తగిలినట్లు కనిపించలేదు. దీంతో వార్నర్ రివ్యూకు వెళ్లకుండా తప్పుచేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వేడ్ మాట్లాడుతూ… ‘‘ఈ విషయం గురించి మాట్లాడుకునేందుకు ఎక్కువగా సమయం దొరకలేదు. వార్నర్ కూడా కాన్ఫిడెంట్‌గా లేడు. తన బ్యాట్ బంతిని తాకిందో లేదో అన్న విషయంపై క్లారిటీ లేదు. అయితే, నాన్ స్ట్రైక్‌లో ఉన్న గ్లెన్ (మాక్స్‌వెల్‌) మాత్రం శబ్దం విన్నాడట. అయితే, తను కూడా ఎటూ చెప్పలేకపోయాడు. అది నిజంగా కఠిన సమయం’’ అని చెప్పుకొచ్చాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos