విజయవాడ : ట్రైన్ టిక్కెట్ల కోసం ప్రయాణీకులు పడే పడిగాపులు ఇన్నీఅన్నీ కావు. సమయం కంటే ముందుగానే వెళ్లి టికెట్ కౌంటర్లో నిలబడాలి. అక్కడి ఉద్యోగులు డబ్బులను కౌంట్ చేసి చిల్లర చూసుకొని ఇచ్చి టికెట్లు తీసుకొని, ప్లాట్ ఫారం చూసుకొని ఇహ… అప్పటికే రైలు వచ్చేసిందంటే పరుగులు తీస్తారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా, డిజిటల్ ఇండియాలో భాగంగా …. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ టిక్కెట్ల చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ను ఉపయోగించవచ్చునని తెలిపింది. దీంతో పాటు టికెట్ కౌంటర్లో ఉద్యోగి నగదు లెక్కించేందుకు పట్టే సమయం కూడా ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలు తక్కువ సమయంలో టిక్కెట్లను పొందుతారు. ఇప్పటికే దేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో ఈ సేవ ప్రారంభమైంది. సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ ఖగజ్నగర్, వికారాబాద్లోని 14 స్టేషన్లలోని 31 కౌంటర్లలో ఈ నగదు రహిత లావాదేవీ అమలు చేయబడుతుంది.