విశాఖ: విజయదశమి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన సాగించనున్నారని, రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. విఘ్నాలు ఉన్నా తొలిగిపోవాలని, మళ్లీ జగనే సీఎం అవ్వాలని గణనాధుడిని పూజించామన్నారు. మూడు రాజధానులకు న్యాయ పరమైన ఇబ్బందులు రావడం వలన కాస్త ఆలస్యం అయిందని, ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఉత్తరాంధ్రా ప్రజలకు భరోసా కల్పించనున్నామని, దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖ అని అన్నారు. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ రాజధానికి అనుకూలంగా ఉంటుందనే.. కేంద్రం కూడా విశాఖను అభివృద్ధి చేయనుందని చెప్పారు. చంద్రబాబు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయారని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, కోర్టులపైన తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. టీడీపీ ఇబ్బందుల్లో ఉందని, ఆ పార్టీని నడిపించడానికి వేరొక నాయకుడికి అప్పగించిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.