ప్యారిస్: ఒలింపిక్స్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్కు చేరుకుంది. అయితే బరువు పెరిగినట్లు తేలడంతో పతకం ఆశలు గల్లంతయ్యాయి. ఆమెపై అనర్హత వేటు పడింది. భారత బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఉదయం ఫొగాట్ 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెల్లడించింది. 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు కావాల్సిన బరువు కంటే ఆమె 100 గ్రాములు అధికంగా ఉందని, ఇది అనర్హతకు దారి తీయవచ్చునని సంబంధిత వర్గాలు అంతకుముందే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ రోజు ఆమె 50 కిలోలకు పైగా ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. ఫొగాట్ ఈ రోజు రాత్రి ఫైనల్లో తలపడాల్సి ఉంది. కానీ బరువు పెరగడంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి. ఫొగాట్ 50 కిలోల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చిందని, కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడిందని భారత ఒలింపిక్ సంఘం పేర్కొంది. దయచేసి ఫొగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. అనర్హత వేటు వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది.