హైదరాబాద్:సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించడం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని వైసీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ దుర్ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు.చందనోత్సవానికి లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినా, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించిందని వెల్లంపల్లి అన్నారు. నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సమీక్షా సమావేశాల్లో పాసుల పంపిణీపై చర్చించారే తప్ప, భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మంత్రులు అక్కడే ఉన్నా ఏర్పాట్లను పట్టించుకోలేదని, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను ప్రస్తావిస్తూ, వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో జరుగుతున్న అపచారాలపై మాట్లాడాలని కోరారు. ఘటనలపై కమిటీలు వేసి చేతులు దులుపు కోవడం సరికాదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడొద్దని హెచ్చరించారు.