న్యూ ఢిల్లీ : భారత్లో విద్యలో నాణ్యత దిగజారుతోందని యునిసెఫ్ తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాథమిక విద్యలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినా.. అప్పర్ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసే రేటు ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. నివేదిక ప్రకారం మన దేశంలో అప్పర్ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన రేటు కేవలం 51 శాతంగానే ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో బంగ్లాదేశ్, ఇండోనేషియా కంటే భారత్ వెనుకబడి ఉంది. సెకండరీ విద్యను పూర్తి చేసే వరకూ విద్యార్థులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెబుతోంది. విద్యా రంగంలో లింగ సమానత్వం మన దేశంలో ఒకేలా లేదు. ప్రాథమిక, లోయర్ సెకండరీ స్థాయిల్లో అసమానతలు తక్కువగా ఉండగా అప్పర్ సెకండరీ స్థాయిలో అధికంగా ఉన్నాయి. సెకండరీ విద్యను పూర్తి చేసుకుంటున్న యువతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, 2025 నాటికి సాధించాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన వేగం కన్పించడం లేదు. సెకండరీ స్థాయిలో లింగ అసమానతలను తగ్గించుకోవడంలో బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలు పురోగతి సాధించాయి. భారత్లో విద్యా నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని, ఎక్కువ మంది విద్యార్థుల్లో నైపుణ్యం కన్పించడం లేదని నివేదిక తెలిపింది. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన వారు సైతం అక్షరాలు సరిగా చదవ లేక పోతున్నారని పేర్కొంది. విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రాథమిక పాఠ శాలలను కూడా ఇంటర్నెట్తో అనుసంధానించాలని యునిసెఫ్ నివేదిక సూచించింది. ఈ విషయంలో మన దేశం బాగా వెనుకబడి ఉంది. నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటేనే నాణ్యమైన విద్యను అందించగలుగుతామని యునెస్కో ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.