రెండో అతి పెద్ద నగరంపై భీకర దాడులు

రెండో అతి పెద్ద నగరంపై భీకర దాడులు

కీయోవ్ : ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆరో రోజు కూడా కొనసాగుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖార్కివ్పై రష్యన్ దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ మంత్రి ఎమైన్ డ్జెప్పర్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘దాడిని తీవ్రంగా ఖండించారు. ఖార్కివ్ నడిబొడ్డున ఉన్న ఫ్రీడమ్ స్క్వేర్ను రష్యన్ క్షిపణి ఢీకొట్టింది. రష్యా ఆటవిక చర్యలకు అనేక మంది అమాయకులు బలైపోయారు. యుద్ధాన్ని వెంటనే ఆపాల’ని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇటువంటి వీడియోను షేర్ చేసింది. అంతర్జాతీయ మానవతావాద చట్టాన్ని ఉల్లంఘిస్తూ తమ దేశంపై రష్యా దాడి చేస్తోందని పేర్కొంది. సాధారణ ప్రజలను చంపుతోందని, పౌర సేవల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. పెద్ద నగరాలను లక్ష్యంగా చేసుకుని, క్షిపణులతో దాడి చేసిందన్నారు. రష్యాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉక్రెయిన్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఖార్కివ్ రీజియన్ హెడ్ ఓలెగ్ సినెగుబోవ్ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా ఈ నగరంపై క్రూయిజ్ మిసైల్స్ను ప్రయోగించి, యుద్ధ నేరాలకు పాల్పడింది. నివాస ప్రాంతాలు, నగర పాలక సంస్థ భవనాలపై దాడులు జరిగాయి. ఉక్రెయిన్ ప్రజలను సర్వ నాశనం చేయడానికి ఈ యుద్ధం జరుగుతోందని ఓలెగ్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos