ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఎయిర్పోర్ట్ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్వో) కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే భారత వాయుసేన రెండు రాఫెల్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంఫాల్ ఎయిర్పోర్ట్ వద్ద గుర్తు తెలియని ఎగిరే వస్తువు కనిపించినట్లు సమాచారం అందటంతో పశ్చిమ బెంగాల్లోని హషిమారా ఎయిర్బేస్ నుంచి రెండు రాఫెల్ యుద్ధ విమానాలు అక్కడికి వెళ్లాయి. అవి యూఎఫ్వో కోసం అంతటా వెతికాయని, అయితే దాని జాడ ఎక్కడా కనిపించలేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ యూఎఫ్వోను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. యూఎఫ్వో వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. అక్కడ దిగాల్సిన విమానాలను ఇతర కేంద్రాలకు మళ్లించారు.