హొసూరు తెలుగు అకాడమీని స్థాపించాలి

హొసూరు తెలుగు అకాడమీని స్థాపించాలి

హొసూరు మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్‌ (కూర్చుని ఉన్న వారు-ఎడమ), డాక్టర్‌ డీకే. ప్రభాకర్‌లను సత్కరిస్తున్న తెలుగు విజ్ఞాన సమితి పదాధికారులు

బెంగళూరు : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగు భాష, సంస్కృతుల వికాసానికి పాటుపడుతున్న తెలుగు విజ్ఞాన సమితి, హొసూరు తెలుగు అకాడమీ స్థాపనకు కృషి చేయాలని హొసూరు మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్‌ కోరారు. తెలుగు విజ్ఞాన సమితి, ఆ సమితి విద్యా ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవంలో డాక్టర్‌ ఎంఎస్‌. రామయ్య జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. తమిళనాట శతాబ్దాల తరబడి తెలుగు, తమిళవారి మధ్య అవినాభావ సంబంధం కొనసాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ఎంతో ఆదరించిన హొసూరు వాసులకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. జీవన సాఫల్య పురస్కారానికి తనను ఎంపిక చేసినందుకు తెలుగు విజ్ఞాన సమితికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో డాక్టర్‌ డీకే. ప్రభాకర్‌ ఎంఎస్‌. రామయ్య విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. అంతకు ముందు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఏ. రాధాకృష్ణ రాజు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించే బాధ్యత గురువులపై ఉంటుందని పేర్కొన్నారు. దివంగత ఎంఎస్‌. రామయ్య ఎంతో మందికి విద్యా దానం చేశారని శ్లాఘించారు. ఈ సందర్భంగా శివాజీ నగర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, నగరంలోని ఇతర తెలుగు పాఠశాలల ఉపాధ్యాయులకు ఎంఎస్‌. రామయ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విజ్ఞాన సమితి ఉపాధ్యక్షుడు గంగరాజు ప్రభృతులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos