న్యూ ఢిల్లీ: రైళ్లలో ప్రయాణించే పిల్లల టిక్కెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటివరకు రూ. 2,800 కోట్లకు పైగా ఆర్జించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) ఇచ్చిన సమాచారం మేరకు పిల్లల టిక్కెట్ల చార్జీల ద్వారా రైల్వే శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.560 కోట్లతో అత్యధిక లాభాలను పొందింది. 2016-17 నుంచి 2022-23 వరకు విశ్లేషించిన డాటా ప్రకారం 3.6 కోట్ల మంది పిల్లలు ప్రత్యేక రిజర్వ్డ్ సీట్ ఆప్షన్ పొందకుండా సగం ధర చెల్లించి రైళ్లలో ప్రయాణించగా, 10 కోట్ల మంది పిల్లలు టిక్కెట్కు పూర్తి చార్జి చెల్లించి బెర్త్/సీట్ ఆప్షన్ను ఎంచుకున్నారు. వీరి కారణంగానే రైల్వేకు అధిక మొత్తంలో ఆదాయం సమకూరింది. మొత్తం ప్రయాణించిన పిల్లలలో 70 శాతం మంది పూర్తి చార్జి చెల్లించే ఆప్షన్ను ఎంచుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016లో రైల్వే ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం 5-12 ఏండ్ల పిల్లలు టిక్కెట్ ధరలో సగం చార్జి చెల్లించి ప్రయాణించవచ్చు. అయితే అతనికి సీటు/బెర్త్ కేటాయించరు. అలా కాకుండా వారికి సీటు/బెర్త్ రిజర్వ్ చేసుకోవాలంటే పూర్తి టిక్కెట్ చార్జీ చెల్లించాలి.