అందాల నేల కార్కల..

  • In Tourism
  • November 1, 2019
  • 360 Views
అందాల నేల కార్కల..

దేశంలో కర్ణాటక రాష్ట్రానికి పర్యాటకంగా ప్రత్యేక స్థానం ఉంటే రాష్ట్రంలో ఉడుపి జిల్లాకు పర్యాటకంగా ప్రత్యేక స్థానం ఉంది.ప్రకృతి ఒడిలో ఒదిగి జిల్లాలో ఎటు చూసినా పర్యాటక,ఆధ్మాతిక ప్రాంతాలు ఉండడం వల్లే ఉడుపికి పర్యాటకంగా ప్రత్యేక స్థానం దక్కుతోంది.జిల్లాలోని కార్కల అనే చిన్న పట్టణంలో ఉన్న ఏకశిల బాహుబలి విగ్రహం,చతుర్ముఖ బసది ప్రముఖ ఆధ్యాత్మిక,పర్యాటక ప్రాంతాలు.కార్కల జైన రాజులు పరిపాలించిన 10 వ శతాబ్దపు చారిత్రిక మూలాలు కలిగిన ప్రదేశంగా గుర్తించబడింది. ఆ సమయంలో ఉన్న పాలకులు అనేక జైన బసదిలు, దేవాలయాలను నిర్మించారు.

చతుర్ముఖ బసది


యూనెస్కో ఈ జైన విగ్రహాలను ప్రపంచ వారసత్వంగా గుర్తించాయంటే ఇక్కడి నిర్మాణాలు,విగ్రహాలు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాతి కొండల్లో సుమారు 42 అడుగుల ఎత్తులో ప్రతిష్టించిన బాహుబలి విగ్రహం దీనికి ముందు ఉన్న బ్రహ్మదేవ స్థంబం వేటికవే ప్రత్యేకమనేలా ఉంటాయి.1432 AD లో నిర్మించారని భావించే బాహుబలి ఏకశిలా విగ్రహం కార్కల పట్టణం ప్రధాన ఆకర్షణగా పరిగణించబడుతోంది. 42 అడుగుల ఎత్తుగల ఈ బాహుబలి ఏకశిలా విగ్రహం కర్నాటకలోని రెండవ పెద్ద విగ్రహం (మొదటిది శ్రావణబెలగోల లోని 55.77 అడుగుల గోమతేశ్వర విగ్రహం).బాహుబలి, గోమటేశ్వర ఏకశిలా ఖండ విగ్రహాన్ని యువరాజు బాహుబలి జ్ఞాపకార్ధం పాండ్య రాజైన వీరపాండ్య భైరవ నిర్మించారని స్థానికులు చెబుతున్న చరిత్ర.

ఏకశిల బాహుబలి విగ్రహం..


ఏకశిల బాహుబలి విగ్రహం టాప్‌ వ్యూ


ఇక ఈ ప్రాంతంలోని ఆకర్షణీయమైన జైన్ స్మారకాలలో ఒకటిగా భావించే చతుర్ముఖ బసది ని తప్పక సందర్సించాలి.1432 లో వీర పాండ్య దేవుడు రాతి కొండపైన నిర్మించిన 108 స్తంభాలు కలిగిన ఈ ప్రదేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.గర్భాలయంలోకి ప్రవేశించిన తరువాత, సందర్శకులు సూర్యత, మల్లి, ఆరా ల విగ్రహాలను చూడవచ్చు. నిలబడిఉన్న విగ్రహాలే కాకుండా, ఇక్కడ గర్భగృహంలో యక్షి పద్మావతి, 24 తీర్ధంకరుల చిత్రాలను కూడా చూడవచ్చు. ధ్యానం చేయాలనుకునే వారికి ఈ చతుర్ముఖ బసది అనువైన ప్రదేశం.

జైన విగ్రహాలు..


కార్కలలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం మూడబిద్రి.గ్రానైట్ రాతిని ఉపయోగించి నిర్మించిన వెయ్యి స్తంభాలు కలిగిన చంద్రనాథ ఆలయం మూడబిద్రి లోని ప్రధాన ఆకర్షణ.జైన కాశి గా పిలువబడే మూడబిద్రి లో10 వ శతాబ్దపు జైన ఆలయం ఉంది, ఇక్కడ గౌరీ ఆలయం (9 వ శతాబ్దం), కాంతవర ఆలయం (7 వ శతాబ్దం) లాంటి కొన్ని హిందూ యాత్రాస్థలాలు కూడా ఉన్నాయి.హిరియంగడి కార్కల సమీపంలో ఉన్న మరొక ప్రఖ్యాత ఆకర్షణ.వీటితోపాటు 60 అడుగుల ఎత్తు కలిగిన మనస్తంభం కూడా ఇక్కడ ప్రసిద్ది చెందింది.

చతుర్ముఖ దేవాలయం


గాలిలో తేలుతూ ఎత్తైన కొండలను స్పృశిస్తూ వాటి మధ్యలో ఉన్న కెరె బసది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.కేరళ రాష్ట్ర సరిహద్దు కావడంతో కెరె బసదిలో కేరళ రాష్ట్ర సంస్కృతి,సంప్రదాయాలు కూడా మిళితమై ఉంటాయి.పడవలో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ కెరె బసదికి చేరుకోవడం వర్ణించలేని అనుభూతిగా మిగులుతుంది.

కెరె బసది..


ఇక ఇక్కడికి సమీపంలోని అత్తూర్ కూడా చూడదగిన పర్యాటక ప్రదేశం. 1759 AD లో స్థాపించబడ్డ సెయింట్ లారెన్స్ చర్చి వల్ల ఈ గ్రామం అత్యంత ప్రసిద్ది పొందింది. చర్చితో పాటు, సందర్శకులు ఈ ధార్మిక క్షేత్రం చుట్టు ఉన్న ప్రకృతి అందం చూడడానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.కార్కలతో పాటు సమయం ఉంటే 50 కిలోమీటర్ల పరిధిలోని శృంగేరి,ఆగుంబె,మంగళూరు తదితర ఎన్నో పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు..

సెయింట్ లారెన్స్ చర్చి


ఇలా చేరుకోవాలి..
బెంగళూరుతో పాటు ఇతర ప్రధాన నగరాల నుంచి కూడా రోడ్డు మార్గం ద్వారా కార్కల పట్టణానికి చేరుకోవచ్చు.రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటూ ఉడుపి రైల్వేస్టేషన్ చేరుకొని అక్కడి నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్కల పట్టణానికి చేరుకోవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos