శివసేన అంతానికి భాజపా కుట్ర

శివసేన అంతానికి భాజపా కుట్ర

ముంబై: శివసేనను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండి పడ్డారు. తమ పార్టీ శ్రేణుల్ని తీసుకెళ్లేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలతో శనివారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.‘ క్లిష్ట సమయంలో కూడా అండగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలే శివసేన అసలైన ఆస్తి. సొంత వ్యక్తుల చేతిలోనే శివసేన మోసపోయింది. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వీరందరికి మనం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. మీలో చాలా మంది టికెట్లు ఆశించినప్పటికీ, మీకు కాకుండా వారికి టికెట్లు ఇచ్చాం. మీ త్యాగాలతో, మీ ఓట్లతో గెలిచిన తర్వాత వీరంతా పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లారు. ఇంత కష్ట కాలంలో కూడా పార్టీ వెన్నంటి ఉన్న మీకు కేవలం ధన్యవాదాలు చెపితే సరిపోదు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని షిండేకు నేను చెప్పా. అయితే, ఆ పని చేయకుండా బీజేపీతో చేతులు కలపాలని మన ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తోందని నాతో చెప్పారు. బీజేపీతో కలవాలంటున్న ఎమ్మెల్యేలను తన వద్దకు తీసుకురావాలని, వారితో నేను మాట్లాడతానని చెప్పా. శివసేనను బీజేపీ చాలా దారుణంగా చూసింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో చాలా మందిపై కేసులు ఉన్నాయి. బీజేపీతో చేతులు కలిపితే వారికి క్లీన్ చిట్ వస్తుంది. శివసేనలోనే ఉంటే వాళ్లు జైలుకు పోతారు. శివసేనకు చెందిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఉంటే బీజేపీలోకి వెళ్లండి. బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన మీరు సీఎం కాలేరు. బీజేపీ వ్యక్తే సీఎం అవుతారు. మీకు డిప్యూటీ సీఎం మాత్రమే అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీకు ఉన్నట్టయితే, ఆ విషయాన్ని నాతో చెప్పి ఉంటే నేనే డిప్యూటీని చేసేవాడిని. సేనను నడిపించే శక్తి నాకు లేదని కార్యకర్తలు భావిస్తే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధం. హిందూ ఓటు బ్యాంకును వేరే పార్టీతో పంచుకోవాలని బీజేపీ భావించడం లేదు. అందుకే శివసేనను అంతం చేయాల నుకుంటోంది. హిందూ ఓటు బ్యాంకు చీలకూడదనే ఏకైక ఉద్దేశంతోనే బాల్ థాకరే బీజేపీతో చేతులు కలిపారరు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే రెబెల్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సంతోషంగా లేరు. శివసేన రెబెల్స్ ఎవరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరు. శివసేన ఓటర్ల వల్ల గెలిచిన ఎమ్మె ల్యేలను మీరు తీసుకెళ్లి ఉండొచ్చు. శివసేన ఓటర్లను మాత్రం తీసుకెళ్లలేరు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లి పోవచ్చు. కొత్త శివసేనను తయారు చేస్తాన’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos