చేదెక్క‌నున్న చ‌క్కెర

చేదెక్క‌నున్న చ‌క్కెర

ముంబై : దేశ వ్యాప్తంగా చక్కెర ధరలు చేదెక్కనున్నాయి. మహారాష్ట్రలో కరువు కారణంగా చక్కెర దిగుబడి ఏకంగా నాలుగేండ్ల కనిష్టస్ధాయికి పడిపోనుండటంతో చక్కెర ధరలు మోతెక్కనున్నాయి. 2023-24 సీజన్లో చక్కెర దిగుబడి 14 శాతం పడిపోనుందని అంచనా. చక్కెర సరఫరాలు తగ్గు ముఖం పడితే ఆహార ద్రవ్యోల్బణం ఎగబాకుతుందనే ఆందోళన నెలకొంది. చక్కెర ఎగుమతుల్లో కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తే ఇప్పటికే పదేండ్ల గరిష్ట స్ధాయిలో పెరిగిన అంతర్జాతీయ చక్కెర ధరలు మరింత ఎగబాకుతాయి. మరోవైపు గ్లోబల్ షుగర్ ధరలు చుక్కలు తాకితే బలరాంపూర్ చినీ, ద్వారికేష్ షుగర్, శ్రీ రేణుక షుగర్స్, దాల్మియా భారత్ షుగర్ వంటి కంపెనీల లాభాల మార్జిన్లు పెరుగుతాయని, అప్పుడు రైతులకు ఆయా కంపెనీలు సకాలంలో చెల్లింపులు చేపడతాయని చెబుతున్నారు.భారత్లో చక్కెర ఉత్పత్తిలో మూడింట ఓ వంతు మహారాష్ట్ర నుంచే సమకూరుతుండటంతో ఈ రాష్ట్రంలో కరువు తాండవించడం చక్కెర ధరలపై పెను ప్రభావం చూపనుంది. చెరకు పండించే ప్రాంతాల్లో కీలక సమయంలో సరైన వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడి దెబ్బతింటుందని, దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాభావంతో పంట దెబ్బతినే అవకాశం ఉందని వెస్టిండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ధాంబ్రే చెప్పుకొచ్చారు. వర్షాభావ పరిస్ధితులకు తోడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చెరకు పంటపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఫలితంగా దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని మహారాష్ట్ర షుగర్ కమిషనర్ చంద్రకాంత్ పుల్కంద్వర్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos