స్టాలిన్‌కు అధికారం పిచ్చి ముదిరింది…మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి

స్టాలిన్‌కు అధికారం పిచ్చి ముదిరింది…మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి

హొసూరు : తమిళనాడు రాష్ట్రంలో ఎడపాడి పళని స్వామి ప్రభుత్వం గద్దె దిగిపోతుందనే భ్రమలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు పిచ్చి ముదిరిందని మాజీ మంత్రి బాలకృష్ణా రెడ్డి ఘాటుగా విమర్శించారు. హొసూరు కార్పొరేషన్ పరిధిలోని జుజువాడిలో జరిగిన జయలలిత 72వ జన్మదినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌లు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. వీరిద్దరి పాలన చూసి ఓర్వలేక స్టాలిన్ ఈపీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని భ్రమ పడుతున్నారని, ఆ భ్రమ కాస్త పిచ్చిగా ముదిరిందని ఎద్దేవా చేశారు.  తమిళనాడు రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎడపాడి పళని స్వామి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం మరెన్నో కార్యక్రమాలను అమలు చేయనున్నారని వెల్లడించారు. ఇదంతా చూసి ఓర్వలేక, ఈపీఎస్ పాలనలో తప్పులు కనిపెట్టలేక డీఎంకే అధ్యక్షుడికి మైండ్‌ బ్లాక్‌ అయిందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల కన్నా తమిళనాడు వ్యవసాయం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఎంతో ముందుందని తెలిపారు. జన్మ దినోత్సవంలో మాజీ కౌన్సిలర్ అశోక్ రెడ్డి,  శ్రీధర్, ఆర్. నారాయణ రెడ్డి, ఏడీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos