అచ్యుతానందన్ కు అపజయం

అచ్యుతానందన్ కు అపజయం

తిరువనంతపురం : సోలార్ కుంభకోణం విషయంలో మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్పై మరో మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వేసిన కేసులో కోర్టు చాందీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. చాందీకి రూ.10.10 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని అచ్యుతానందన్ను స్థానిక న్యాయస్థానం ఆదేశించింది. 2013లో చాందీ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సోలార్ స్కామ్ కేరళ రాజకీయాల్లో కలకలం రేపింది. సరితా నాయర్ అనే మహిళ తన భాగస్వామితో కలిసి ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి సోలార్ ప్యానెళ్లు సరఫరా చేయకుండా వంచించారు. చాందీ వద్ద పనిచేసే వ్యక్తుల్లో ముగ్గురికి.. సరితతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని విధుల నుంచి తొలగించారు. కుంభకోణం ద్వారా సంపాదించిన డబ్బును తరలించేందుకు చాందీ కొత్త కంపెనీని ఏర్పాటు చేసేందుకూ వెనకాడలేదని అప్పటి విపక్ష నేత అచ్యుతానందన్ విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. దీనిపై చాంది 2014లో పరువు నష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు విచారణ జరిపిన తిరువనంతపురం సబ్ కోర్టు అచ్యుతానందన్ తన ఆరోపణలకు సరైన ఆధారం సమర్పించలేకపోయారని పేర్కొంది. పరువు నష్టంగా రూ.10.10 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. నిజానికి చాందీ రూ.కోటి పరువు నష్టం దావా వేశారు. తర్వాత మనసు మార్చుకున్న ఆయన కోర్టు ఖర్చుల నిమిత్తం చెల్లిస్తే సరిపోతుందని న్యాయస్థానానికి తెలిపారు. కోర్టు తీర్పుపై అచ్యుతానందన్ న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరువనంతపురం జిల్లా కోర్టులో దీనిపై అప్పీలుకు వెళ్తామన్నారు. ప్రస్తుతం అచ్యుతానందన్ వయసు 98. 2006 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వృద్ధాప్యం, కరోనా ప్రస్తుతం.. చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యారు. వామపక్షాలకు నాయకత్వం వహిం చి 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాందీకి వ్యతిరేకంగా భారీగా ప్రచారాలు చేశారు అచ్యుతానందన్. ఆ ఎన్నికల్లో వామ పక్షాలు ఘన విజయాన్ని సాధించాయి. అచ్యుతానందన్ను పక్కనబెట్టిన సీపీఎం నాయకత్వం పినరయి విజయన్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos