అమరావతి: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలని అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన ఉందా? అందుకే పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ఎందుకంత జాప్యం చేస్తున్నారని వైఎస్ షర్మిల నిలదీయడంపై పెమ్మసాని మండిపడ్డారు. ఏపీ ప్రజలను షర్మిల దారి మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం ఆరోగ్యశ్రీకి ప్రత్యామ్నాయం కాదని పెమ్మసాని వెల్లడించారు. ఇది ఆరోగ్యశ్రీకి ప్రత్యామ్నాయం కాదని ప్రజలకు వైద్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయపూరిత కుట్రలకు బలికావద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి పెమ్మసాని ట్వీట్పై షర్మిల సీరియస్ అయ్యింది. తాను ప్రజలను పక్కదారి పట్టించడానికి మాట్లాడి ఉంటే మిమ్మల్ని సమాధానం ఎందుకు అడుగుతానని ప్రశ్నించింది. మీ పత్రికా సమావేశంలో ప్రజలకు అనుమానాలు తలెత్తాయని.. అవి తమ దృష్టికి రావడంతో తాను స్పందించి ప్రజలకు స్పష్టత ఇవ్వమని అడగడం జరిగిందని షర్మిల తెలిపారు. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నేతగా.. ‘ ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు.. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు.. పేషెంట్లకు వైద్యం అందడం లేదు.. అందుకే ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ కార్డులు తీసుకోండి.’ అని మీరే ఆరోగ్యశ్రీ పథకం కొనసాగింపుపై అనుమానాలు కలిగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడిపే వాళ్లే బాధ్యతారాహిత్యమైన కామెంట్స్ చేయొచ్చా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీ చేయకుండా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆటంకాలు రాకుండా కొనసాగించాలని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని ఎన్డీయే కూటమి ఎన్నికల హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది ఎప్పటిలోగా అమలు చేస్తారో కూడా ప్రజలకు వివరించాలని అడిగారు.