29న సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ రెడ్డి చిత్ర పటం ఆవిష్కరణ

29న సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ రెడ్డి చిత్ర పటం ఆవిష్కరణ

హొసూరు : సీనియర్‌ జర్నలిస్టు, తెలుగు భాషాభిమాని దివంగత మునిరెడ్డి సత్యనారాయణ రెడ్డి చిత్ర పటాన్ని ఇక్కడి ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనంలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించనున్నారు. హొసూరు మాజీ ఎమ్మెల్యే కేఏ. మనోహరన్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు కే. రాధాకృష్ణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తమిళనాడులో తెలుగు భాషకు అన్యాయం జరిగినప్పుడల్లా నిరసన గళం విప్పే సత్యనారాయణ రెడ్డి, హొసూరు ప్రాంతంలో తెలుగు భాష ప్రాభవ వైభవాల కోసం చేయని పనంటూ లేదు.  నిర్బంధ తమిళ విద్యా బోధన లాంటి ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ అనేక ఆందోళనలు చేశారు. పారిశ్రామికీకరణ పేరిట హొసూరు ప్రాంతంలోని తెలుగు వారి భూములను లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. ఆందోళనలతో హొసూరు ప్రాంతాన్ని అట్టుడికించారు. దివంగత కోదండ రామయ్య స్ఫూర్తిగా తమిళనాడులో తెలుగు భాష కలకాలం వర్ధిల్లాలని అహరహం శ్రమించారు. తెలుగు భాషకు చిన్న సమస్య ఎదురైనా, తానే ముందుండి అది పరిష్కారం అయ్యేంతవరకు విశ్రమించేవారు కాదు. ఆ సమస్య పరిష్కారానికి చెన్నైకి వెళ్లాలన్నా, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌కు పోవాలన్నా, ఆఖరుకు దేశ రాజధాని ఢిల్లీ ముంగిట వాలాలన్నా వెనుకడుగు వేసే వారు కాదు. హొసూరు ప్రాంతంలో దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల వద్ద తెలుగు బోర్డులు మాయమై క్రమేపీ తమిళ బోర్డులు దర్శనమిస్తుండడంపై ఆందోళన చెందేవారు. రాబోయే తరాలు తెలుగు భాషను మరిచిపోతారేమోననే ఆదుర్దాతో హొసూరు ప్రాంతంలో క్రమం తప్పకుండా కవి గోష్టులు, సాహిత్య సమావేశాలు నిర్వహించేవారు. తెలుగు నాడులోని ఎందరో రచయితల పుస్తకాలను హొసూరు ప్రాంతంలో, తమిళనాట విస్తారంగా పంపిణీ చేసేవారు. తెలుగు భాషకు పట్టం కట్టడానికి, తెలుగు తల్లికి నీరాజనాలు పలకడాని నేను సైతం…అంటూ ఎప్పుడూ ముందుండే వారు. తొమ్మిదో దశకంలో పాత్రికేయ వృత్తిలో అడుగిడిన ఆయన, దాని ఆలంబనగా తెలుగు భాషా వికాసానికి చెమటోడ్చేవారు. వివిధ తెలుగు దిన పత్రికల్లో పని చేసిన, ఆయన ఏ పత్రిక పక్షానా కాకుండా తెలుగు పక్షానే నిలిచేవారు. హొసూరు ప్రాంతానికి అన్ని తెలుగు పత్రికలన్నీ ఇబ్బడి ముబ్బడిగా రావాలనేది ఆయన ఆకాంక్ష. ఈ క్రమంలో సొంత డబ్బును ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడేవారు కారు. తమిళనాడు, కర్ణాటకల్లో దాదాపు అయిదు శతాబ్దాలు తిరుగులేని పత్రికగా భాసిల్లిన ఆంధ్రప్రభ 2003లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ యాజమాన్యం నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కొత్త యాజమాన్యం ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్‌ మూసివేసి, తిరుపతికి మార్చివేసింది. తల్లడిల్లిన సత్యనారాయణ రెడ్డి హొసూరు నుంచి తిరుపతికి వచ్చి ఆ పత్రిక ఏజెన్సీని తానే తీసుకుని, డిపాజిట్‌ మొత్తం చెల్లించారు. ఆ పత్రిక  నిత్యం హొసూరుకు రావాలని ఉబలాటపడ్డారు. అయితే ఆయన కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికికైనా సత్యనారాయణ రెడ్డి వెనుకాడలేదు. కానీ ఆంధ్రప్రభ కొత్త యాజమాన్యం హొసూరుకు పత్రికను సరఫరా చేయలేకపోయింది. అప్పుడు సత్యనారాయణ రెడ్డి పడిన వేదన అంతా ఇంతా కాదు. తమిళనాట, ముఖ్యంగా హొసూరు ప్రాంతంలో తెలుగు భాష పరిఢవిల్లడానికి తుది శ్వాస విడిచే వరకు ఆయన శ్రమించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos