నేర గాళ్లను నిషేధించేందుకు సర్కారు సుముఖంగా ఉందా?

న్యూఢిల్లీ : నేరగాళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది,పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం అభిప్రాయాన్ని తెలియ జేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును సుప్రీం కోరింది.‘‘సుప్రీంకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరి దాదాపు 15 నెలలైంది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే తప్ప చట్టాన్ని రూపొందించడం లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిం చడం కుదరదు.దీని కోసం ఎన్నికల కమిషన్ను సంప్రదించాలి, ఈ న్యాయస్థానం సమస్యను నిర్ణయించడం అంత సులభం కాదు. శాసన మార్గాన్ని అనుసరించాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం చెప్పింది. ఘోరమైన నేరంలో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తి జీవితాంతం కానిస్టేబుల్ పదవికి కూడా అనర్హుడని ఉపాధ్యాయ్ వాదించారు. ‘‘కానీ అదే విధంగా దోషిగా తేలిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి, హోం మంత్రిగా ఉండటానికి అనర్హుడని ’’ ఉపాధ్యాయ్ వాదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos