ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు..? వెళ్లి క్షమాపణలు చెప్పండి

ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు..? వెళ్లి క్షమాపణలు చెప్పండి

న్యూ ఢిల్లీ:కర్నల్‌ సోఫియా ఖురేషి పై మధ్యప్రదేశ్‌ బీజేపీ మంత్రి విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. సదరు మంత్రిని తీవ్రంగా మందలించింది. తన వ్యాఖ్యలకు గానూ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణ కార్యదర్శి విక్రం మిస్రీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌తో కలసి కర్నల్‌ సోఫియా ఖురేషీ విలేకరుల సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదుల సోదరిగా సోఫియా ఖురేషీని వర్ణించేందుకు ప్రయత్నిస్తూ బీజేపీకి చెందిన గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్‌ షా ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మంత్రి వేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ విచారణ జరిపారు. ఈ సందర్భంగా మంత్రిని తీవ్రంగా మందలించారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. కర్నల్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవిగా అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రసంగాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. ‘మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు..? మీరు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలి. వెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి’ అంటూ మందలించారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.మరోవైపు కర్నల్‌పై వ్యాఖ్యలకు గానూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసు శాఖను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. . కోర్టు ఆదేశాలతో పోలీసులు సదరు మంత్రిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, కర్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్‌ షాను ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి) జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos