న్యూ ఢిల్లీ:రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టొచ్చా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందన్నారు. ‘రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు..? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు.. కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?’ వంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద పలు ప్రశ్నలు వేసినట్లు ఇండియా టుడే నివేదించింది. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలని అడిగినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే..
రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలేంటి?
రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు?
సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?
రాజ్యాంగంలోని 361వ అధికరణం, 200వ అధికరణం కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షపై పూర్తి నిషేధం విధిస్తుందా?
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాల మేరకు ఆర్టికల్ 143 కింద సుప్రీం కోర్టు సలహాను పొందడానికి లేదా గవర్నర్, రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లును రిజర్వ్ చేయడం లేదా ఇతర విధంగా సుప్రీంకోర్టు అభిప్రాయం పొందడం అవసరమా?