విర్రవీగిన వారిని ఇంటికి పంపారు

విర్రవీగిన వారిని ఇంటికి పంపారు

ముంబై: ఓటర్లను తక్కువగా అంచనా వేయరాదని భాజపాకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హితవు పలికారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పవార్ చెప్పారు. విఖ్యాత మరాఠీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తి కరమైన వ్యాఖ్యల్ని చేసారు. ‘ ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి మహామహులకే ఓటర్లు చుక్కలు చూపించారు.ఎన్నికల్లో ఓడించారు. ‘’నేను మళ్లీ వస్తా’’ అంటూ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎన్నికల సమయంలో అతి విశ్వాసంతో వ్యవహరించారు. దీంతో ఆయన అహంకారం ప్రజలకు అర్థమయింది. భాజపాను అధికారానికి దూరం చేసారు. ప్రజాస్వామ్య దేశంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే భావనతో ఉండరాదు. ఇలాంటి భావజాలాన్ని ఓటర్లు అంగీకరించరు. ఎందరో పవర్ ఫుల్ లీడర్లు ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ప్రజల సంవేదన భిన్నంగా ఉంది. ఆ ఎన్నికల్లో భాజపాకు అనుకూల వాతావరణం ఉండింది. శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి భాజపాకు ప్రజాదరణ తగ్గింది. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలు మార్పును కోరుకున్నారని చెప్పారు.బాల్ థాకరే ఏనాడూ రాజ్యాధికార స్థానంలో కూర్చోకపోయినా అధికారాన్ని నడిపించే శక్తిగా ఆయన ఉన్నారు. తన సిద్ధాంతాల కారణంగానే బాల్ థాకరే మహారాష్ట్రలో తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం బాల్ థాకరే సిద్ధాంతాల ఆధారంగా అధికారంలోకి రాలేదు. ప్రజలు కట్టబెట్టిన ఈ అధికారాన్ని, అధికార బాధ్యతను సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉద్ధవ్ థాకరేపై ఉంద’ని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos