పవార్​ను బెదిరిస్తారా?

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ‘కేంద్ర మంత్రి ఒకరు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను బెదిరించారు. అందుకు ప్రధాని మోదీ, నేత అమిత్ షా మద్దతు ఇస్తారా..? ’అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శిందే వర్గాన్ని ఉద్దేశించి.. అలలు వస్తాయి, పోతాయని వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన మహారాష్ట్ర బిడ్డ. వారు ఆయన్ను బెదిరి స్తున్నారు. మోదీజీ, అమిత్ షా.. వీటి గురించి మీరు విన్నారా..? మీ మంత్రి పవార్ను బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకు మీరు మద్దతు ఇస్తున్నారా..? మీ వైఖరేంటో మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మహావికాస్ ఆఘాడీని కాపాడేందుకు పవార్ ప్రయత్నిస్తే.. ఆయన్ను ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటామని ఆ మంత్రి బెదిరించారు. రోడ్డు మీద నిలువరిస్తామని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదే భాజపా పని తీరు అయితే. అదే విషయాన్ని మీరే ప్రకటించండి. ప్రభుత్వం ఉండొచ్చు లేక పడిపోవచ్చు. కానీ పవార్తో వ్యవహరించిన తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అంటూ ట్విటర్ లో ఆరోపించారు. శిందే వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వారి సంఖ్య కేవలం కాగితంపైనే ఉందన్నారు. ‘శివసేన ఒక సముద్రం. అలలు వస్తాయి. పోతాయి. నిబంధనలు అంటూ కొన్ని ఉన్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. ఇది ఒక న్యాయపోరాటం. కొంతమంది 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటున్నారు. ఇంకొకరు ఇంకో సంఖ్య చెప్తున్నారు. ఏ రూపంలో పోరాటం జరిగినా చివరకు గెలిచేది మేమే’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos