వారు చివరి మెట్టును చేరగలిగారు

దేవుడి సన్నిధే ఒక అలౌకిక అనుభూతి. దాన్ని ఆస్వాదించడానికే ఆలయానికి వెళ్తాం! రుతుచక్ర వయసులో ఉన్న మహిళల శారీరక శుభ్రత ఆధారంగానే అయ్యప్ప దర్శనం ఆడవాళ్లకు ఇవ్వలేదు. రుతుస్రావం ప్రకృతి ఇచ్చిన ప్రత్యుత్పత్తి ప్రక్రియ. అదే లేకపోతే సృష్టే లేదు అనే తర్కంతో దేవుడి దర్శనం కోసం స్త్రీలు ఉద్యమించారు. సాధించారు. నలభై రెండేళ్ల బిందు అమ్మిని, నలభై ఒక్క ఏళ్ల కనకదుర్గ… చట్టం కల్పించిన హక్కును వినియోగించుకున్నారు. ప్యూబర్టీ రాని, మెనోపాజ్‌ వచ్చిన ఆడవాళ్లే శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలనే నియమాన్ని సవరించారు. శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మొదటి మహిళలు (రుతుక్రమ వయసులో ఉన్న)గా చరిత్ర సృష్టించారు. మొన్న మంగళవారం రాత్రి (ఒకటవ తారీఖు) ఎర్నాకులం నుంచి బయలుదేరి బుధవారం తెల్లవారు జామున శబరిమల ప్రారంభ ప్రాంతమైన పంపానది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పోలీసుల రక్షణతో శబరిమలకు వెళ్లారు. బుధవారం (రెండో తారీఖు) ఉదయం 3 గంటల 45 నిమిషాలకల్లా ఆలయంలోకి అడుగుపెట్టారు.

ఆ ఇద్దరి నేపథ్యం బిందు… ఒక యాక్టివిస్ట్‌. దళిత్‌ యాక్టివిస్ట్‌.
కన్నూర్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌లో ప్రొఫెసర్‌. చిన్నప్పటి నుంచీ బిందు రెబల్‌. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. కమిట్‌మెంట్‌కు మరోపేరు ఆమె. జెండర్‌ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్‌ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్‌ యాక్టివిస్ట్‌ హరిరన్‌ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్‌ జిల్లాలోని పోక్కాడ్‌ ఆమె నివాసం.

కనకదుర్గ.. ఓ భక్తురాలు … కనకదుర్గ నాయర్‌ కేరళ రాష్ట్ర సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఉద్యోగి. భర్త ఉన్ని కృష్ణన్‌. ఇంజనీర్‌. వాళ్లకు ఇద్దరు పిల్లలు. మలప్పరంలో ఉంటారు. ఓ భక్తురాలిగా శబరిమల దర్శనానికి వెళ్లాలనుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos