ఓటమి అంచున దక్షిణాఫ్రికా

  • In Sports
  • October 21, 2019
  • 51 Views
ఓటమి అంచున దక్షిణాఫ్రికా

రాంచీ : ఏదో మహాద్భుతం జరిగితే తప్ప మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఓటమి దాదాపుగా ఖరారైనట్లే. భారత్తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో దక్షిణాఫ్రికా ఓటమికి రెండు వికెట్ల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌటై, ఫాలో ఆన్ ఆడుతున్న డుప్లెసిస్ సేన, రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఓటమికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో చెలరేగిన భారత బౌలర్లు, రెండో ఇన్నింగ్స్లోనూ సఫారీలను వణికించారు. ముఖ్యంగా షమీ విసిరే నిప్పులు చెరిగే బంతులకు బెంబేలెత్తి వికెట్లు సమర్పించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో మెరిసిన హమ్జాను డకౌట్ చేసిన షమీ అదే ఊపుతో కెప్టెన్ డుప్లెసిస్ (4), బవుమా (0)లను పెవిలియన్ పంపాడు. మరోవైపు, ఉమేశ్ కూడా సఫారీ బ్యాట్స్మెన్ను దెబ్బకొట్టాడు. డికాక్ (5), వికెట్ కీపర్ క్లాసెన్ (5)లను అవుట్ చేశాడు. ఓపెనర్ ఎల్గర్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అశ్విన్, జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. లిండే 27, పీడ్ట్ 23, బ్రుయన్ 30 పరుగులు చేశారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 497 పరుగులు చేసింది. రోహిత్ శర్మ ద్విశతకం (212) చేయగా, రహానే 115 పరుగులు చేశాడు.

తాజా సమాచారం