అమరావతి:టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలపై మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదని, అడ్డంగా దొరికిపోయిన కేసు అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో 13 చోట్ల సంతకాలు పెట్టి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఈ కేసులో ఈడీ, ఐటీ, జీఎస్టీలు కూడా విచారణ జరిపాయని తెలిపారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్ తన అభిమానులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయకపోతే ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కల్యాణ్… సీఎం జగన్ ను ఏం చేయగలరని ఎద్దేవా చేశారు. చంద్రబాబునే ఏమీ చేయలేని బాలకృష్ణ… జగన్ ను ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 24 గంటల్లోనే పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించారని విమర్శించారు.