ట్రెక్కింగే కాదు రివర్ ర్యాఫ్టింగ్ కూడా మధురానుభవమే..

  • In Tourism
  • November 5, 2019
  • 266 Views
ట్రెక్కింగే కాదు రివర్ ర్యాఫ్టింగ్ కూడా మధురానుభవమే..

వారాంతంలో స్నేహితులతో,కుటుంబంతో సరదగా గడపాలంటే హిల్స్‌స్టేషన్లకో లేదా ఆధ్యాత్మిక ప్రాంతాలకో వెళ్లడం నగరవాసులకు పరిపాటే.అయితే పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లిన సమయంలో కేవలం ప్రకృతి అందాలు చూసి ఆనందించడానికి మాత్రమే పరిమితం కాకుండా కొంత సాహసం కూడా చేస్తే జీవితంలో మరపురాని తీపి సాహస జ్ఞాపకాలు అందుకోవచ్చు.కర్ణాటకలో ఆధ్యాత్మికం,ఆహ్లాదం రెండూ ఒకేచోట లభించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో కొన్నింటిలో రివర్ ర్యాఫ్టింగ్ అనే జలక్రీడ మరచిపోలేని జ్ఞాపకాలు ఇస్తుంది.బృందాలుగా ఏర్పడి నదిలోని నీటి ప్రవాహంలో తెప్పలపై ప్రయాణం వర్ణించలేని అనుభవం.మరి అటువంటి ప్రదేశాలు కర్ణాటకలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం పదండి..
కూర్గ్ :
బెంగళూరు నగరం నుంచి 263 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూర్గ్ రివర్ ర్యాఫ్టింగ్‌కు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ సంచురీ బ్యాక్ డ్రాప్, నది ప్రవాహాల్లో ర్యాఫ్టింగ్, బరపోలే ర్యాఫ్టింగ్ జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది.గ్రేడ్-2 నుండి గ్రేడ్ – 4 వారికి ఇది అనుకూలం.ర్యాఫ్టింగ్ కోర్స్ నేర్చుకునేవారు 3 కి. మీ వరకు వెళ్లిరావచ్చు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ర్యాఫ్టింగ్ క్రీడకు అనుమతిస్తారు..

కూర్గ్‌లో రివర్‌ ర్యాఫ్టింగ్‌


భీమేశ్వరి :
బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో మండ్య జిల్లాలోని కావేరి నదిపై మేకెదాటు,శివనసముద్ర జలపాతాల మధ్య ఉన్న భీమేశ్వరి కేవలం ఫిషింగ్ క్యాంపునకు మాత్రమే కాకుండా రివర్ ర్యాఫ్టింగ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది.కావేరి నది నీటి ప్రవాహంలో తెప్పలలో విహారం సాహసికులను మైమరిపిస్తోంది.సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు సాగే ర్యాఫ్టింగ్ క్రీడలో కావేరి మలుపులు, ఎత్తుపల్లాలు ఆహ్లాదాన్ని పంచుతాయి.ర్యాఫ్టింగ్‌కు అవసరమయ్యే తెప్పలు, తెడ్డులు, హెల్మెట్లు మరియు ఇతర వస్తువులు అక్కడే అద్దెకు దొరుకుతాయి.

భీమేశ్వరిలో రివర్‌ ర్యాఫ్టింగ్‌


దండేలి :
బెంగళూరు నుంచి 467 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండేలి అటవీ ప్రాంతంలో రివర్ ర్యాఫ్టింగ్ అన్నిటికి మించిన అందమైన అనుభవంగా మిగిలిపోతుంది.’కర్ణాటక సాహసక్రీడల పుట్టిల్లు’ గా పిలువబడే దండేలి చుట్టూ దట్టమైన అడవి, జీవ వైవిధ్యంతో అలరారే కాళీ నది తీరంలో రివర్ ర్యాఫ్టింగ్‌లో పాల్గొనటానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు.దండేలి ర్యాఫ్టింగ్ ట్రైల్ సుమారు 12 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గ్రేడ్ – 2, గ్రేడ్ -3 రైడర్లకు మరియు ప్రొఫెషనల్, అనుభవనం లేని రాఫ్టర్ లకు కాళీ నదిలో ర్యాఫ్టింగ్ సురక్షితం.

దండేలి రివర్‌ ర్యాఫ్టింగ్‌


కొండాజి :
బెంగళూరు నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండాజి కూడా రివర్ ర్యాఫ్టింగ్ క్రీడకు కేంద్రంగా విరాజిల్లుతోంది.దట్టమైన అడవులు,ఎత్తైన కొండల మధ్య ప్రవహించే కబిని నదిపై రివర్ ర్యాఫ్టింగ్ తప్పకుండా చేయాల్సిందే.ర్యాఫ్టింగ్తో పాటు ఇక్కడి అద్భుతమైన దృశ్యాలు నయన మనోహరంగా ఉంటాయి.ఇక్కడ ర్యాఫ్టింగ్ చేసేటప్పుడు శిరస్త్రాణం ధరించడం తప్పనిసరి. కయాకింగ్, కొరకిల్ రైడ్ మరియు సర్ఫింగ్ క్రీడలకు శిక్షణ ఇప్పించే తిమ్మయ్య నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్వెంచర్ సంస్థ కూడా ఇక్కడ ఉంది.

కొండాజిలో రివర్‌ ర్యాఫ్టింగ్‌


హొన్నెమర్దు :
బెంగళూరు నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గ జిల్లాలోని హొన్నెమర్దు కూడా రివర్ ర్యాఫ్టింగ్‌కు చాలా ప్రసద్ధి చెందింది.శరావతి నది వెనుక జలాలల్లో దట్టమైన పశ్చిమ కనుమలు అడవిలో వన్యప్రాణులను వీక్షిస్తూ రివర్ ర్యాఫ్టింగ్ చేయడం ఇష్టపడే ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఏటవాలు కొండలపై, ద్వీపం వలె రిజర్వాయర్ మధ్యలో ఉన్న ఈ ఊరిలో ర్యాఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ ఆచరించవచ్చు.

హొన్నేమర్దులో రివర్‌ ర్యాఫ్టింగ్‌


ఆగుంబే :
బెంగళూరు నుంచి 355 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గ జిల్లాలోని సీతా నది, రివర్ ర్యాఫ్టింగ్ కు ఫెమస్. దట్టమైన అడవులు, వివిధ రకాల ఔషధ మొక్కలు, జంతువులు, జలపాతాల మధ్యలో నదిలో ర్యాఫ్టింగ్ ఒక మరుపురాని అనుభూతి. అరేబియా సముద్రంలో సూర్యుడు అస్తమించే అద్భుత దృశ్యాన్ని ఈ ప్రాంతం నుండి చూడవచ్చు.

ఆగుంబేలో రివర్‌ ర్యాఫ్టింగ్‌


గోకర్ణ :
జీవితంలో ఎన్నడూ చూడని విధంగా నీటిలో సాహసం చేయాలంటే గోకర్ణలో రివర్‌ ర్యాఫ్టింగ్‌ తప్పక చేయాల్సిందే.బెంగళూరు నుంచి 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకర్ణలో రివర్‌ ర్యాఫ్టింగ్‌ రోలర్‌ కోస్టర్‌ను తలపిస్తుంది.అసమాన భౌగోళిక పరిస్థితులు,రాళ్ల మధ్యలో ఎప్పుడు ఎలా తిరుగుతాయో తెలియని నీటిలో రివర్‌ ర్యాఫ్టింగ్‌ అంటే చెప్పడానికి కూడా మాటలు చాలడం లేదు.ఒక్కసారి ఇక్కడ ర్యాఫ్టింగ్‌ చేస్తే శాశ్వతంగా రివర్‌ ర్యాఫ్టింగ్‌ మధుర జ్ఞాపంగా మిగిలిపోతుంది.

గోకర్ణలో రివర్‌ ర్యాఫ్టింగ్‌

తాజా సమాచారం

Latest Posts

Featured Videos