మరోసారి సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా

మరోసారి సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా

గుంటూరు: సీఐడీ అధికారుల ఎదుట విచారణకు ఆర్జీవీ హాజరు కాలేదు. విచారణకు 8 వారాల సమయం కోరారు. సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనన్న ఆర్జీవీ, తన తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. కాగా రాంగోపాల్‌ వర్మ 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో సినిమాని తీశారు. ఆ సినిమా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో కొందరు పిల్‌ వేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాని యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే పేరుతోనే విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులకు మంగళగిరి సమీపంలోని ఆత్మకూర్‌కు చెందిన వంశీకృష్ణ బండారు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని దృశ్యాలను తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కులాలను రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు రామ్​గోపాల్ వర్మపై మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో గతేడాది నవంబరు 29వ తేదీన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన నోటీసులను 7వ తేదీన సీఐడీ అధికారులు వర్మకు అందజేశారు. నేడు గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని సీఐడీ పోలీసులు సూచించారు. సినిమా ప్రమోషన్‌లో ఉన్నా – 8 వారాల తర్వాత వస్తా: అయితే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా ద్వారా ఒక వర్గం మనోభావాల్ని దెబ్బతీశారని నమోదైన కేసులో ఇవాళ విచారణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరు కాలేదు. తన న్యాయవాదిని పంపించి విచారణకు 8 వారాల సమయం కావాలని అభ్యర్థించారు. 10వ తేదీన గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొన్నప్పటికీ, సినిమా ప్రమోషన్​లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనంటూ ఆర్జీవీ సీఐడీ అధికారులకు తెలిపారు. 8 వారాల తర్వాత వస్తానన్నారు. వర్మ ఇచ్చిన జవాబుపై సీఐడీ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. మరోసారి నోటీసు ఇవ్వాలని సీఐడీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos