హైదరాబాదు: కార్పోరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే రుణ మాఫీ చేశామన్నారు. కార్పోరేట్ కంపెనీలు రూ.14 లక్షల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టాయని, అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకో కూడదనేది తమ విధానం అన్నారు. గతంలో ఎంతోమంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో ఈరోజు పండుగ రోజు అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తాము మూడు విడతలుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు.