అగ్ర వర్ణ కులాల పేదలకు రేజర్వేషన్లు సాధ్యమయ్యేనా??

అగ్ర‌కులాల్లో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. దానికి సంబంధించిన రిజ‌ర్వేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లును ఇవాళ మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో అగ్ర‌కులాల‌కు మోదీ స‌ర్కార్ ప‌ది శాతం కోటా ఇవ్వాల‌నుకుంటున్న‌ది. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్నవారు ఈ కోటా పరిధిలోకి వస్తారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అగ్రవర్ణ కోటాకు పచ్చజెండా ఊపారు. ఇటీవలి ఉత్తరాది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం నేపథ్యంలో మోదీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించేవి కావు. కేంద్రం తాజా నిర్ణయంతో వారికి కోటా ఫలాలు దక్కనున్నాయి.సోమవారం ప్రధాని మోడీ ఈ కోటా అంశాన్నివ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు.ఈ ఫైల్‌ను కేబినెట్‌లో పెట్టడం, ఆ వెంటనే ఆమోదించడంతో నేడు(మంగళవారం) లోక్‌సభ ముందుకు తీసుకొస్తున్నారు. కేంద్రమంత్రి తావర్ చంద్‌ గెహ్లాట్ ఈ బిల్లు ఇవాళ ( జనవరి 8 ) సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుతం ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలకు 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు ఎనకమికల్లీ వీకర్ సెక్షన్స్- EWS వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఇస్తే అది 59.5 శాతానికి పెరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం కోటా 50 శాతం మించడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేయాలని అని నిర్ణయిస్తే అందుకు రాజ్యాంగ సవరణ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 సవరించడం ద్వారా అగ్రవర్ణ పేదల కోటా తేవాలని కేంద్రం భావిస్తోంది.ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు, జాట్లు, మరాఠీలు, భూమిహార్‌లు, కమ్మ, క్షత్రియ, రెడ్డి, కాపు, వైశ్య లాంటి కులాలకు రిజర్వేషన్లు అమలవుతాయి. ఐతే.. ఈ కోటా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, కేంద్ర విద్యాసంస్థల్లో చదువులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆయా ప్రభుత్వాలు ఈ కేంద్ర చట్టాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పడు స్థానికంగా ఉద్యోగాలు, విద్యాసంస్తల్లో సైతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఐతే.. దేశవ్యాప్తంగా 15 శాతంగా ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మిగతా కోటా మొత్తం వెనుకబడిన వర్గాలకు ఇవ్వాలని కొన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోటా బిల్లుపై లోక్‌సభలో జరిగే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

అయితే బిల్లు పాస్ కావడానికి బీజేపీ అనేక సవాళ్ళను అధిగమించాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా ఎదురయ్యే సవాళ్లు ఏంటంటే….
-రాజ్యాంగం ప్రకారం లక్ష రూపాయలకన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న పౌరులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి సామాజిక వర్గాలకు చెందనివారు ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ)లుగా పరిగణింపబడతారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల గురించి రాజ్యాంగంలో ఎటువంటి నిర్వచనం లేదు. ప్రభుత్వం ప్రతిపాదించబోయే బిల్లులో ఇది కీలకం కానుంది.
-ఈ రిజర్వేషన్లను అమలు చేయాలంటే.. ప్రభుత్వం తన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనకు సర్వే గణాంకాలను జోడించాల్సి ఉంటుంది.
-బిల్లు ఆమోదం పొందినా.. అది న్యాయ పరిశీలనకు వెళ్లకుండా ఉండాలంటే.. బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాల్సి ఉంటుంది.
-న్యాయ పరిశీలనకు అందకుండా రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఈ రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు ఉద్దేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఎలా వివరిస్తుందో స్పష్టతలేదు.
-ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజ్యాంగం పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం లేదు. రిజర్వేషన్ల కల్పనకు ఆర్థిక కారణాలను పరిగణించడం లేదు. అంతమాత్రాన ప్రభుత్వం పేదలకు సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు, రుణాలు, ఆర్థిక సాయం రూపంలో సహాయపడుతున్నా రాజ్యాంగం అడ్డుపడటం లేదు.
-ఒకవేళ రాజ్యాంగాన్ని సవరించినా.. అది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకంగా ఉంటుంది గనుక దానిని కోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
-ఇప్పటికే కులాల ఆధారిత రిజర్వేషన్లు 49శాతం ఉన్నాయి. దీని జోలికి వెళ్లకుండా 10శాతం రిజర్వేషన్ కల్పించాలంటే మిగిలిన 51 శాతం నుంచి కేటాయించాలి. అప్పుడు బహిరంగ పోటీ 41 శాతానికి తగ్గిపోతుంది. ఇది సాధ్యమేనా?
-ఇందిరా సాహ్నీ కేసులో.. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించేందుకు పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్టికల్ 16(1) లేదా 16(4) ప్రకారం ఇటువంటి రిజర్వేషన్లు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఆదాయం లేదా ఆస్తి కలిగి ఉన్నారన్న నెపంతో ఓ పౌరుడి నియామకాన్ని తిరస్కరించడం అందరికీ సమాన అవకాశాలు అన్న భావనను ధ్వంసం చేసేదిగా భావించాల్సి ఉంటుందని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos