రవి శాస్త్రి భావోద్వేగం

  • In Sports
  • February 20, 2020
  • 148 Views
రవి శాస్త్రి భావోద్వేగం

వెల్లింగ్టన్‌: టీమ్‌ఇండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి ఎప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటారు. సాధారణంగా జట్టు ఓడిపోతున్నా, గెలుస్తున్నా ఆయన ముఖ కవళికల్లో మార్పుండదు. ప్రత్యేకించి హావభావాలేమీ ప్రదర్శించరు. న్యూజిలాండ్‌, భారత్‌ తొలి టెస్టు వేదిక బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో అడుగుపెట్టగానే ఇందుకు అతీతంగా మారిపోయారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకో తెలుసా? సరిగ్గా 39 వసంతాల క్రితం ఇదే మైదానంలో ఇదే రోజున (ఫిబ్రవరి 21) ఆయన టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. అప్పుడాయనకు 19 ఏళ్లు. 151వ సంఖ్యగల టోపీని అందుకున్నారు. ఆ విషయాన్ని కోహ్లీసేనతో పంచుకున్నారు. ‘39 వసంతాలు గడిచాయి. మనం ఏమిస్తే తిరిగి మనకదే దక్కుతుందని అంటారు. ఇదే రోజు (శుక్రవారం).. ఇదే మైదానం.. ఇదే జట్టు.. ఇదే నగరంలో 39 ఏళ్ల క్రితం నేను టెస్టుల్లో అరంగేట్రం చేశాను. నమ్మలేకుండా ఉంది’ అని శాస్త్రి ట్వీట్‌ చేశారు. తన అరంగేట్రం నాటి నుంచి ఉన్న చెక్క కుర్చీల ముందు నిలబడి తీసుకున్న చిత్రాన్ని ఆయన పోస్ట్‌ చేశారు. ‘ఆ డ్రెస్సింగ్‌ రూమ్‌లో

ఇప్పటికీ మార్పులేదు’ అని కుర్రాళ్లకు చెప్పారు. ఆసక్తికరమైన సంగతేంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఆయన జట్టుకు ఎంపికయ్యారు. అంతకు ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు దిలీప్‌ దోషి గాయపడ్డారు. దాంతో ముంబయి తరఫున కాన్పూర్‌లో రంజీ క్వార్టర్స్‌ ఆడుతున్న రవిశాస్త్రికి కబురు పంపించారు. ముంబయి జట్టు బస చేసిన అతిథి గృహం కాపలాదారు వచ్చి.. జాతీయ జట్టుకు ఎంపికైన విషయాన్ని శాస్త్రికి తొలుత చెప్పారు. తన తొలి మ్యాచులో ఆల్‌రౌండర్‌గా ఆయన అదరగొట్టారు. పదో స్థానంలో దిగి 3, (17 బంతుల్లో), 19 (54 బంతుల్లో) పరుగులు చేశారు. ఇక స్పిన్నర్‌గా సంచలనం సృష్టించారు. ఆరు వికెట్లు సాధించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3/54, రెండో ఇన్నింగ్స్‌లో 3/9తో రాణించారు. ఈ మ్యాచులో భారత్‌ 62 పరుగుల తేడాతో ఓడినప్పటికీ ఆ తర్వాత శాస్త్రి 11 ఏళ్లు టీమ్‌ఇండియా తరఫున ఆడారు. ఇప్పుడు కోచ్‌గా ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos