టీమిండియాను ఓడిస్తే…పాక్ జట్టుకు బ్లాంక్ చెక్

  • In Sports
  • October 8, 2021
  • 96 Views
టీమిండియాను ఓడిస్తే…పాక్ జట్టుకు బ్లాంక్ చెక్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టులో మనోస్థైర్యాన్ని నింపేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఓ సంచలన ప్రకటన చేశాడు. మెగా ఈవెంట్లో భారత్‌ను మట్టికరిపిస్తే పాక్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తమ దేశ పర్యటనను అర్దాంతరంగా రద్దు చేసుకున్న న్యూజిలాండ్ జట్టుకు కూడా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చాడు.
ఈ సందర్భంగా ఆయన బీసీసీఐని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి 90 శాతం నిధులు సమకూరుస్తుంది బీసీసీఐయేనని, భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి నిధులు మళ్లించడం మానుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచ కప్‌లో దాయాదులు మరోసారి ఎదురెదురుపడనున్నారు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్ జట్టు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్‌లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. 5 మ్యాచుల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచుల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచులన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos