అమరావతి: యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని.. అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.15వేల కోట్లు కేటాయించింది మొత్తం అప్పు మాత్రమేనని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.15వేల కోట్ల గ్రాంట్ వచ్చిందని చంద్రబాబు డాంభీకాలు పలికారని.. తీరాచూస్తే అవి అప్పులని తేలిందని విమర్శించారు. రూ.4వేల పెన్షన్ మొదటి నెల ఇచ్చారు కానీ ఇక నుంచి అనర్హుల పేరుతో ఎగ్గొట్టబోతున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ తలచుకుంటే భయమేస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని మోసగాడు చంద్రబాబు అని అంబటి రాంబాబు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన మొనగాడు జగన్ అని తెలిపారు. చంద్రబాబుకు భూముల సర్వేపై కనీస జ్ఞానం కూడా లేదని విమర్శించారు. బ్రిటీష్ కాలం నుంచి భూముల సర్వే జరగలేదని.. అందుకే భూ సమస్యలు ఉండకూదని కేంద్రం భూసర్వే చేయిస్తోందని చెప్పారు. హక్కుదారులకే భూమి ఉండాలని తమ ప్రభుత్వం భావించిం దన్నారు. 14,630 మంది సర్వేయర్లతో సర్వే చేయించామని స్పష్టం చేశారు.వైసీపీలో నంబర్ టూ అంటూ జరుగుతున్న ప్రచారంపై అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీలో నంబర్ టూ ఉండదని.. పార్టీలో ఏకైక నాయకుడు జగన్ మాత్రమే అని అన్నారు. తామంతా జగన్ వెంటే ఉంటామని.. జగన్ చెప్పింది చేయడమే తమ పని స్పష్టం చేశారు. గతంలో వైసీపీపై అనేక కుట్రలు చేసినా జగన్ ఛేదించి గెలిచారని గుర్తుచేశారు. తమ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు. తమ కార్యకర్తలు, నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఫలితం ఉండదని అన్నారు.