.స్వేచ్ఛాయుత సముద్ర యానానికి భారత్ మద్దతు

.స్వేచ్ఛాయుత సముద్ర యానానికి భారత్ మద్దతు

న్యూఢిల్లీ : ఇండో పసిఫిక్ మహా సముద్రంలో స్వేచ్ఛాయుత, అందరికీ అవకాశం ఉండే, సమ్మిళిత వ్యవస్థ ఉండాలని భారత దేశం కోరుకుంటున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దక్షిణ చైనా సముద్రంతో సహా అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత సముద్ర యానం, గగనతల యానం, ఆటంకాలు లేని వాణిజ్యం జరగాలని, అందుకు భారత దేశం మద్దతునిస్తుందని చెప్పారు. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం (ఏడీఎంఎం-ప్లస్) వర్చువల్ సమావేశంలో బుధవారం మాట్లాడారు. ‘సముద్ర సంబంధ భద్రత సవాళ్ళు భారత దేశానికి మరొక ఆందోళన కలిగించే అంశం. దక్షిణ చైనా సముద్రంపై అనుసరించవలసిన ప్రవర్తనా నియమావళికి సంబంధించిన చర్చలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సత్ఫలితాలిస్తాయి. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవిస్తూ, ఇండో పసిఫిక్ మహా సముద్రంలో స్వేచ్ఛాయుత, అరమరికలు లేని, సమ్మిళిత వ్యవస్థ ఏర్పడాలని భారత దేశం పిలుపునిస్తోంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధిలను ప్రోత్సహించేందుకు విలువలు, సమ్మిళిత దార్శనికతతో సహకార చర్యలను భారత దేశం బలోపేతం చేసింది. ప్రపంచంతోపాటు భారత దేశం కూడా ఉగ్రవాదంపై ఆందోళన చెందుతోంది. ఉగ్రవాదుల మధ్య నెట్వర్కింగ్ భయానక స్థాయికి చేరుకుంటున్న సమయంలో, ఉగ్రవాద సంస్థల మధ్య నెట్వర్క్ను పూర్తిగా దెబ్బతీయాలంటే సమష్టి సహకారం తప్పనిసర’ని పేర్కొన్నారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్)లో బ్రూనే, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం ఉన్నాయి. ఈ సంఘంలో చర్చల భాగస్వాములను ప్లస్ దేశాలుగా పేర్కొన్నారు. ఈ ప్లస్ దేశాల్లో భారత దేశం, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజిలాండ్, కొరియా, రష్యా, అమెరికా ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos