పూజారులు ఆలయాల భూముల సంరక్షకులు మాత్రమే

పూజారులు ఆలయాల భూముల సంరక్షకులు మాత్రమే

న్యూ ఢిల్లీ : పూజారులు ఆలయాలకు ఇచ్చిన భూములకు సంరక్షకులు మాత్రమేనని, వారికి ఎలాంటి యాజమాన్య హక్కులూ ఉండబోవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారు యజమానులు కాదు కాబట్టి రెవెన్యూ రికార్డుల్లో పూజారుల పేర్లు రాయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆలయ భూములపై పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన వారు భూస్వాములు కాలేరని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆలయాల భూములను పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేలా, ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ మధ్య రెండు ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీన్ని కొందరు హైకోర్టులో సవాలు చేసినపుడు ప్రభుత్వ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయ మూ ర్తులు హేమంత్ గుప్తా, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం.. ఆలయ భూముల దాఖలాల్లో ఓనర్షిప్ కాలమ్, అనుభవదారు కాలమ్లలో దేవుడి పేరు మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఆ భూములకు దేవుడే యజమాని. పూజారి కేవలం దేవుడి ఆస్తులకు సంరక్షకుడు. అందువల్ల పూజారుల పేర్లు అక్కడ రాయాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం పూజారి అంటే వ్యవసాయంలో కౌలుదారుడు కాదు. దేవుడికి పూజలు చేసే వ్యక్తి. అయితే, దేవస్థానం తరఫున ఆ భూమిని కలిగి ఉంటాడు. దేవుడి ఆస్తులను పరిరక్షిస్తుంటాడు. అంతమాత్రాన అతడు భూస్వామి కాలేడు’ అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos