భవానీపుర్‌లో ముగిసిన పోలింగ్

భవానీపుర్‌లో ముగిసిన పోలింగ్

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోరు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్​ అంతా ప్రశాంతంగానే జరిగినట్లు చెప్పారు. భవానీపుర్​లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ, భాజపా కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. నకిలీ ఓటర్లను పోలింగ్​ కేంద్రంలోకి టీఎంసీ పంపిస్తోందని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. అయితే.. కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపు చేశాయి. మరో చోట భాజపా, టీఎంసీ కార్యకర్తలకు మధ్య తలెత్తిన ఘర్షణలో భాజపా నేత కల్యాణ్​ చౌబే కారు ధ్వంసం అయింది. వార్డు నెంబర్​ 72లో ఓటింగ్​ ప్రక్రియను బలవంతంగా ఆపేందుకు టీఎంసీ ప్రయత్నించిందని భాజపా అభ్యర్థి టిబ్రేవాల్​ ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్​ హకీమ్​, సుబ్రతా ముఖర్జీ యత్నించారని ఆరోపించారు. ఈ మేరకు ఎలక్షన్​ కమిషన్​కు వారిరువురిపై ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఆరోపణలను హకీమ్ తిప్పికొట్టారు. “రోడ్డు పక్కన టీకొట్టులో టీ తాగడం కూడా ఓటర్లను ప్రభావితం చేసినట్టేనా? ఉపఎన్నికల్లో ఓడిపోతమని భాజపాకు తెలుసు. అందుకే మాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోంది” అని విమర్శించారు.

మరో వైపు టిబ్రేవాల్​ 20 కార్లలో వచ్చి ఓటర్లను ప్రభావితం చేశారని ఎలక్షన్ కమిషన్​కు టీఎంసీ ఫిర్యాదు చేసింది. అయితే.. తమ ఏజెంట్లను బూత్​లోపలికి టీఎంసీ కార్యకర్తలు పంపించట్లేదని ఆరోపిస్తూ భాజపా ఫిర్యాదు చేసింది.  టీఎంసీ అక్రమాలకు పాల్పడిందంటూ భాజపా చేసిన ఫిర్యాదులు అన్నింటినీ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.

భవానీపుర్ ఉపఎన్నికలో భాగంగా బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని మిత్ర ఇన్​స్టిట్యూట్​లో ఓటేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఈ ఉపఎన్నికలో భవానీపుర్‌ నుంచి పోటీ చేశారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అక్టోబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos