పార్లమెంటు ఉద్యోగుల డ్రెస్‌పై బీజేపీ కమలం

పార్లమెంటు ఉద్యోగుల డ్రెస్‌పై బీజేపీ కమలం

న్యూఢిల్లీ : మోదీ సర్కారు ‘వ్యవస్థల బీజేపీకరణ’ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే ముగిసిన జీ20 సదస్సును మొత్తం బీజేపీ సమావేశాలుగా మార్చేసిందన్న విమర్శలు సమసిపోకముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. పార్లమెంటు ఉభయ సభల్లో పనిచేసే ఉద్యోగులు, మార్షల్స్కు బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలాలతో కూడిన నూతన యూనిఫాంను రూపొందించింది. ఈ నెల 18వ తేదీనుంచి నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ యూనిఫాంలతోనే ఉద్యోగులు దర్శనమివ్వనున్నారు. ఉద్యోగులందరికీ కొత్త యూనిఫాంలను ఈ నెల 7వ తేదీనే అందజేసినట్టు జాతీయ మీడియా తెలిపింది.
కుర్తా, పైజామా, చీర
పార్లమెంటు ఉభయసభల్లో మార్షల్స్ ఇతర ఉద్యోగులు కలిపి 271 మంది పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటివరకు విధి నిర్వహణ సమయంలో సఫారీలు ధరించేవారు. వాటి స్థానంలో భారత సంప్రదాయ యూనిఫాంను మోదీ సర్కారు ప్రవేశపెట్టింది. అయితే, వాటిపై బీజేపీ గుర్తును ముద్రించటం తీవ్ర దుమారం రేపుతున్నది. పురుష ఉద్యోగులు ఇకపై క్రీమ్ కలర్ కుర్తా పైజామా ధరిస్తారు. మహిళా ఉద్యోగులు అదేరంగు చీరలు ధరిస్తారు. వీటన్నింటిపై కాషాయ రంగులో చిన్నచిన్న కమలం పుష్పాలు ముద్రించి ఉంటాయి. ఈ యూనిఫాంలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ యూనిఫాంపై రాజకీయ దుమారం రేగుతున్నది. కొత్త యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తును ఎలా ముద్రిస్తారని లోక్సభలో కాంగ్రెస్ విప్ మానికమ్ ఠాకూర్ ప్రశ్నించారు. పార్లమెంటును బీజేపీ తన సొంత ఇలాఖాలా భావిస్తున్నదని మండిపడ్డారు. ‘కమలాన్ని ఒక్కదాన్నే ఎందుకు ముద్రించారు? నెమలిని, పులిని ఎందుకు ముద్రించలేదు? ఓహో.. అవి బీజేపీ ఎన్నికల సింబల్స్ కావు కాబట్టి ముద్రించలేదా? ఓం బిర్లా (లోక్సభ స్పీకర్) గారూ.. ఇంత దిగజారటం ఎందుకండి?’ అని ట్వీట్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos