పద్మ పురస్కారాల తిరస్కరణ

పద్మ పురస్కారాల తిరస్కరణ

న్యూఢిల్లీ: తమకు ప్రకటించిన పద్మ పురస్కారాలను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, ప్రముఖ నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ తిరస్కరించారు. పద్మభూషణ్ అవార్డు స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనని బుద్ధదేవ్ చెప్పినట్టు సీపీఎం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పురస్కారాలు తీసుకోరాదన్నది తమ పార్టీ విధానమని స్పష్టం చేసింది. తాము ప్రజల కోసం పనిస్తామని, అవార్డుల కోసం కాదని ప్రకటించింది.
గతంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్‌కు ‘పద్మ’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన దానిని తిరస్కరించారని సీపీఎం గుర్తు చేసింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును నంబూద్రిపాద్ నిరాకరించారు.
దేశాన్ని అవమానించడమే.. గులాం కావాలనుకోవడం లేదు
పద్మభూషణ్‌ను తిరస్కరించడం ద్వారా భట్టాచార్జీ దేశాన్ని అవమానించారని, బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ అన్నారు. పద్మ అవార్డులు ఏ ఒక్క పార్టీకి లేదా సిద్ధాంతానికి చెందినవి కాదని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ.. ‘ఆయన ఆజాద్‌గా ఉండాలనుకుంటున్నారు. గులాం అవ్వాలను కోవడం లేద’ని వ్యాఖ్యానించారు.
అవమానంగా ఉంది.. అవార్డు వద్దు: సంధ్యా ముఖర్జీ
నేపథ్య గాయని సంధ్యా ముఖర్జీ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని నిరాకరించినట్లు పీటీఐ తెలిపింది. ఆలస్యంగా ఎంపిక చేసినందుకు ఆమె అవార్డును వద్దనుకున్నట్టు సమాచారం. ‘90 సంవత్సరాల వయస్సులో సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు స్వర ప్రస్థానం సాగించిన సంధ్యా ముఖర్జీకి ఇంత ఆలస్యంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం ఆమెను కించపరచడమేన’ని ఆమె కుమార్తె సౌమీ సేన్‌ గుప్తా అన్నారు. అవార్డును తిరస్కరించడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.
కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘పద్మ’ అవార్డులు ప్రకటించింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos