పదేళ్లలో బ్యాంకులకు రూ.16.35లక్షల కోట్ల మొండి బకాయిలు

పదేళ్లలో బ్యాంకులకు రూ.16.35లక్షల కోట్ల మొండి బకాయిలు

న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీలు పెడుతున్న కేటుగాళ్లు.. గుదిబండలుగా మారుతున్న కార్పొరేట్లు.. అధికారులతో కలిసి వందలు, వేల కోట్లను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్ల ఆగడాలు ఎంతకీ తగ్గడం లేదు. గడిచిన 10 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని బ్యాంకులు దాదాపు రూ.16.35 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు)ను రైటాఫ్‌ చేశాయని సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు మరి. సామాన్యుల దగ్గర్నుంచి ముక్కుపిండి వసూలు చేసే బ్యాంకర్లు.. వేల కోట్లను ఎగవేసినా ఏండ్ల తరబడి కిమ్మనకుండా ఉండిపోతుండటం.. రైటాఫ్‌ల పేరిట ఖాతా పుస్తకాలను క్లియర్‌ చేసుకుంటుండటం.. అటు పాలనాపరంగా, ఇటు చట్టాలు-వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపిస్తున్నాయి.

ఒక్క ఏడాదే రూ.2.36 లక్షల కోట్లు

2018-19 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.2,36,265 కోట్ల ఎన్‌పీఏలు రైటాఫ్‌ అయినట్టు మంత్రి సీతారామన్‌ చెప్పారు. అలాగే కనిష్ఠంగా 2014-15లో రూ.58,786 కోట్ల లోన్లు రైటాఫ్‌ జరిగినట్టు తెలిపారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) రూ.1,70, 270 కోట్ల రైటాఫ్‌లు జరిగితే.. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) రూ.2,16,324 కోట్ల నిరర్థక ఆస్తులను రైటాఫ్‌ చేసినట్టు వివరించారు. అయితే రైటాఫ్‌ వల్ల రుణగ్రహీతకు లాభం జరిగినట్టు అనుకోవద్దని, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాల్సిందేనని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సదరు బాకీల వసూలుకు బ్యాం కులు రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాయన్నారు. కోర్టుల్లో కేసులు వేయడం, డెట్‌ రికవరీ ట్రిబ్యునళ్లను ఆశ్రయించడం, దివాలా చట్టం కింద నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్స్‌కు వెళ్లడం, అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు ఎన్‌పీఏలను అమ్మేయడం వంటివి చేస్తూంటాయని వివరించారు.

ఆర్బీఐ డాటాలో..

గత ఏడాది డిసెంబర్‌ 31నాటికి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో 29 యూనిక్‌ బారోవర్‌ కంపెనీలున్నాయని, వీటన్నింటినీ ఎన్‌పీఏలుగానే వర్గీకరించారని, ఒక్కోటి రూ.1,000 కోట్లు, ఆపైనే బకాయిపడ్డాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు చెప్తున్నాయి. ఈ 29 కంపెనీల మొండి బకాయిల విలువ రూ.61,027 కోట్లుగా ఉండటం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos