టీమిండియా కోచ్ : విదేశీయులకు నో ఛాన్స్

  • In Film
  • October 13, 2021
  • 119 Views
టీమిండియా కోచ్ : విదేశీయులకు నో ఛాన్స్

టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో అతని వారసుడు ఎవరనే అంశంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ వర్గాలు ఓ క్లారిటీ ఇచ్చాయి. టీమిండియా తదుపరి కోచ్‌గా విదేశీయులకు ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పాయి. కోచ్ రేసులో భారత మాజీ ఆటగాళ్లే ఉంటారని సూచనప్రాయంగా వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లేలు స్వచ్చంధంగా కోచ్ పదవిపై నిరాసక్తత కనబర్చడంతో వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌ల పేర్లు బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరు ముగ్గురికి ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంఛైజీల తరఫున కోచింగ్ అనుభవం కూడా ఉండడంతో.. ఎవరో ఒకరికి రవిశాస్త్రి వారసుడిగా పట్టం కట్టడం ఖాయమని తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కోచ్ పదవికి విదేశీ కోచ్ ఫార్ములా వర్కవుట్ కాదని, అందులోనూ బోర్డు పరిశీలనలో ఉన్న రికీ పాంటింగ్, మహేల జయవర్దనే, టామ్ మూడీ లాంటి వాళ్లు ఫుల్ టైమ్ కోచ్‌గా పని చేసేందుకు అయిష్టత ప్రదర్శిస్తున్నారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గతంలో నలుగురు విదేశీయులు టీమిండియా కోచ్‌లుగా పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత జాన్ రైట్, ఆతర్వాత గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టెన్‌, డంకన్ ఫ్లెచర్ భారత జట్టు హెడ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos