నాట్యకళలకు నిలయం నృత్యగ్రామ్..

నాట్యకళలకు నిలయం నృత్యగ్రామ్..

స్వర్గాన్ని తలపించే పర్యాటక ప్రాంతాలకు,ఆకాశ అంచులను తాకే ఎత్తైన శిఖరాలతో కూడి దట్టమైన అడవులకు అంతకు మించి ఆధ్యాత్మిక ప్రాంతాలకు కేంద్రంగా విరాజిల్లుతున్న కర్ణాటక రాష్ట్రం సాంస్కృతిక,లలితకళలకు కూడా నిలయంగా బాసిల్లుతోంది.కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరానికి సమీపంలోనున్న నృత్యగ్రామం కూడా భారతీయ సనాతన సంస్కృతిలో అతిముఖ్యమైన లలితకళలకు చిరునామాగా నిలుస్తోంది.ఎటు చూసినా పచ్చటి తివాచి కప్పుకొన్న ఎత్తైన కొండలు,లోయలు మది పరవశించే ప్రకృతి అందాల మధ్య వెలసిన నృత్యగ్రామ్‌లో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక భావాలు ముంచెత్తుతాయి.పలు భంగిమల్లో అందంగా తీర్చిదిద్దిన శిల్పాలను చూస్తుంటే ఏదో తెలియని ఆహ్లాదం,తన్మయత్వం కలుగుతాయి.

నృత్యగ్రామ్ లోపలి దృశ్యం..

నృత్యగ్రామ్ లోపలి దృశ్యం..

సనాతన భారతీయ లలితకళలపై యువతకు ఆసక్తి పెంపొందించి వాటిని ప్రపంచవ్యాప్తం చేయడానికి 1990లో ప్రముఖ నాట్యకళాకారిణి ప్రొటిమా గౌరి స్థాపించిన నృత్యగ్రామ్‌ ప్రముఖ నృత్యకళాక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది.నృత్యగ్రామ్‌లో లలితకళలు నేర్చుకోవడానికి దేశవిదేశాల నుంచి సైతం యువతులు,మహిళలు వస్తుంటారు.

నృత్యాలు నేర్చుకోవడానికి తరలివచ్చిన మహిళలు..

కళాకారిణిల నృత్యప్రదర్శన..

1994వ సంవత్సరంలో వసంత హబ్బ(హబ్బ అంటే తెలుగులో పండుగ) పేరుతో ప్రొటిమా నిర్వహించిన కార్యక్రమాన్ని క్లాసికల్‌ ఉడ్‌స్టాక్‌ ఆఫ్‌ ఇండియగా పిలుస్తారు.అలా మొదలైన వసంత హబ్బ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల మొదటి శనివారం నిర్వహించసాగారు.ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి 40వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యేవారు.అయితే 2004లో సునామి సంభవించడంతో సుమారు ఆరేళ్ల పాటు వసంత హబ్బ కార్యక్రమాన్ని నిలిపివేశారు.అనంతరం 2011లో కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు.నృత్యగ్రామ్ గురించి విదేశాలకు చెందిన కొంతమంది డాక్యుమెంటరీలు సైతం చిత్రీకరించారు.

నృత్యగ్రామ్ లోపలి దృశ్యం..

నృత్యగ్రామ్ లోపలి దృశ్యం..

నృత్యగ్రామ్ లోపలి దృశ్యం..

అమెరికాకు చెందిన నాన్‌ మెల్విల్లే నృత్యగ్రామ్‌-ఫర్‌ ది లవ్‌ ఆఫ్‌ డాన్స్‌ పేరుతో తీసిన 30 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీ 2010లో న్యూయార్క్‌ నగరంలో నిర్వహించిన వార్షిక డాన్స్‌ ఆన్‌ కెమెరా ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడింది.నృత్యగ్రామ్‌లో లలితకళల్లో శిక్షణ పొందిన పలువురు కళాకారిణిలు దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు చేసి దేశ సంస్కృతి,కీర్తి,చరిత్రతో పాటు నృత్యగ్రామ్‌ గొప్పదనాన్ని కూడా చాటారు.న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పలు అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు,పత్రికలు సైతం నృత్యగ్రామ్‌ గురించి గొప్ప వ్యాసాలు,కథనాలు ప్రచురించాయి.
బెంగళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో హెసరఘట్టలోనున్న నృత్యగ్రామ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే బయటి ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయి ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టామేమో అన్న భావన కలుగుతుంది.

కొలనులో హంసల సందడి..

మట్టితో నిర్మించిన గృహాలు..

గుబురుగా కనిపించే చెట్లు వాటి నుంచి వీచే చల్లటి పవనాలు,మట్టి,రాళ్లతో నిర్మించిన గృహాలు,అక్కడక్కడా నీటి కొలనులు వాటిపై మెట్లవంతెనలు, ఎటు చూసినా అందదంగా చెక్కిన నృత్యశిల్పాలు,నృత్యశిక్షణ తరగతి గదులు ఇలా ప్రతిఒక్కటి మదిని సమ్మోహనపరిచేవే.నృత్యగ్రామ్‌లో అంకిత ఆలయం(టెంపుల్‌ ఆఫ్‌ డెడికేషన్‌)నృత్యగ్రామ్‌ లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతుంది.లలితకళల్లోని పలు నృత్యభంగిమలు,ముద్రలు తదితర వాటిని వివరిస్తూ నిర్మించిన టెంపుల్‌ ఆఫ్‌ డెడికేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.ఆలయం లోపల నీరు పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన గ్రానైట్‌ బండ,నిరంతరం వెలిగే మంట ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి.

టెంపుల్‌ ఆఫ్‌ డెడికేషన్‌..

నృత్యగ్రామ్‌లో భరతనాట్యం,కూచిపూడిలతో పాటు ఒడిస్సీ,మోహినియాట్టం,కథక్‌ నృత్యపాఠశాలలు కూడా అత్యంత ప్రసిద్ధి చెందాయి.నృత్యగ్రామ్‌లో నాట్యకళలతో పాటు పలు రకాల పండ్లు,కూరగాయాలు,పూలు తోటలు కూడా మదిని పరవశింపచేస్తాయి.పరిమళాలు వెదజల్లే ఈ తోటల్లో షికారు చేయడం స్వర్గంలో చేయడం రెండూ ఒకటే అనే భావన కలుగుతుంది.ఇక నృత్యగ్రామ్‌ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనున్న హెసరుఘట్ట జలాశయం కూడా చూడదగ్గ పర్యాటక ప్రదేశమే.పచ్చటి కొండల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుచుకుంటూ హెసరుఘట్ట జలాశయం చేరుకోవడం మరో ప్రత్యేక అనుభవం.

మట్టి,రాళ్లతో నిర్మించిన గృహం..

నృత్యగ్రామ్‌లో శిల్పాలు..

 

నృత్యగ్రామ్‌లో శిల్పాలు.. 

ఇలా చేరుకోవాలి..
రోడ్డు,రైలు మార్గం మీదుగా నేరుగా బెంగళూరు చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు లేదా సొంత వాహనాల్లో నేరుగా హెసరుఘట్టలోని నృత్యగ్రామ్‌ చేరుకోవచ్చు.విమానమార్గంలో అయితే కెంపేగౌడ విమానాశ్రయం నుంచి క్యాబ్‌లలో నేరుగా నృత్యగ్రామ్‌ చేరుకోవచ్చు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos