పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ అసెంబ్లీలో క్షమాపణలు తెలిపారు. చదువుకున్న మహిళలను కించపరిచేలా అసెంబ్లీలో చేసిన కామెంట్ పట్ల ఆయన బుధవారం క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఇవాళ నిరసన వ్యక్తం చేయడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం నితీశ్ తెలిపారు. జనాభా నియంత్రణ విషయంలో మహిళా పాత్ర కీలకమైందని, ఈ నేపథ్యంలో సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పునరుత్పత్తి రేటు తగ్గిన అంశం గురించి సభలో చర్చిస్తూ.. భార్య చదువుకున్నదైతే .. గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందని సీఎం నితీశ్ అన్నారు. కుల గణన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సీఎం నితీశ్ ఆ అంశంపై మాట్లాడుతూ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా కొన్ని కామెంట్లు చేశారు. శృంగారం వల్ల గర్భం దాల్చుకుండా ఎలా ఉండాలన్న విషయం చదువుకున్న మహిళలకు తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని నొక్కి చెప్పేందుకు ఆయన కొంత ఘాటు భాషను వాడారు. చదువుకున్న మహిళల వల్ల జనాభా నియంత్రణ జరుగుతుందని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. బీహార్లో ఫెర్టిలిటీ రేటు 4.2 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయిందని రిపోర్టులో ఉన్న విషయాన్ని నితీశ్ సభలో తెలిపారు. అయితే నితీశ్ చేసిన ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. చాలా నీచమైన భాషను సీఎం నితీశ్ వాడారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్ మాత్రం నితీశ్ను సమర్ధించారు. స్కూళ్లల్లో బోధిస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్ విషయాన్ని నితీశ్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. సీఎం నితీశ్ కుమార్ క్షమాపణలు చెప్పాలని జాతీయ మహిళా కమీషన్ చైర్పర్సన్ డిమాండ్ చేశారు. విధాన సభలో మహిళల గురించి వ్యాఖ్యలు చేయడం మహిళల్ని అవమానించడమే అవుతుందన్నారు.