వచ్చే నెల 1న ఉరి

వచ్చే నెల 1న ఉరి

ఢిల్లీ : నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. దీంతో తాజా డెత్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ తీహార్ జైలు అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్ వారెంట్ జారీ చేయాలని తీహార్ అధికారుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. క్షమాభిక్ష పిటిషన్ కొట్టివేత గురించి దోషి ముఖేశ్‌కు సమాచారమిచ్చేందుకు కోర్టు జైలు అధికారులకు సాయంత్రం 4.30 గంటల వరకు సమయమిచ్చింది. దీంతో అధికారులు ముఖేశ్‌కు అధికారికంగా సమాచారమిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో మరో దోషి అయిన పవన్ గుప్తా మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సంఘటన సమయంలో తాను బాలుడినని, దాని ఆధారంగానే విచారణ జరపాలని అభ్యర్థించాడు.
2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై ఢిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష పడింది. మరో దోషి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos