ఐపీఎల్ : ముంబై వేదిక హైదరాబాద్‌కు మార్పు?

  • In Sports
  • April 3, 2021
  • 134 Views
ఐపీఎల్ : ముంబై వేదిక హైదరాబాద్‌కు మార్పు?

మరో వారం రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలవబోతోంది. ఏప్రిల్ 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐతే హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచులను నిర్వహించడం లేదని బీసీసీఐ ప్రకటించడంతో.. నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు. హెచ్‌సీఏ చైర్మన్‌తో పాటు మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్లో మ్యాచులను నిర్వహించాలని బీసీసీఐని కోరారు. కానీ బీసీసీఐ పెద్దలు పట్టించుకోలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా హైదరాబాదులో మ్యాచులు నిర్వహించాలని భావిస్తోంది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడమే ఇందుకు కారణం.

ముంబైతో పాటు అన్ని నగరాల్లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. శుక్రవారం మహారాష్ట్రలో 47,913 కేసులు నమోదయ్యాయి. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు. అంతేకాదు వాంఖడే స్టేడియంలో పనిచేసే పలువురు సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ముంబైలో జరిగే అన్ని మ్యాచులను.. హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నారు. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

కరోనా నేపథ్యంలో కేవలం ఆరు స్టేడియాల్లో మ్యాచులు నిర్వహిస్తున్నారు. నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నట్లు షెడ్యూలులో ప్రకటించారు. ఈసారి హైదరాబాద్, జైపూర్, మొహాలీ వేదికల్లో మ్యాచులను నిర్వహించడం లేదు.  ప్లేఆఫ్‌తో పాటు ఫైనల్ మ్యాచులను అహ్మదాబాదులోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.  ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్ 2021 టోర్నీ జరగనుంది. లీగ్ దశలో మొత్తం 56 మ్యాచులు జరుగుతాయి. ఒక్కో జట్టు మొత్తం నాలుగు స్టేడియాల్లో ఆడుతాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు స్టేడియాల్లో పదేసి మ్యాచులు జరుగుతాయి. ఢిల్లీ, అహ్మదాబాదులో మాత్రం 8 చొప్పున మ్యాచులు నిర్వహిస్తారు. ఏ జట్టు కూడా తన సొంత గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడబోదు. అన్ని మ్యాచులు తటస్థ వేదికల్లోనే జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచులను నిర్వహించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos